నకిరేకల్ లో ఏడుగురు దొంగల అరెస్ట్..రూ.2.32 లక్షల నగదు స్వాధీనం

నకిరేకల్ లో ఏడుగురు దొంగల అరెస్ట్..రూ.2.32 లక్షల నగదు స్వాధీనం
  • రూ.2.32 లక్షల నగదు, కారు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం 

నకిరేకల్, వెలుగు : నకిరేకల్ పట్టణంలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు దొంగిలించిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా యాగర్లపల్లి మండలానికి చెందిన పురుపురెడ్డి నాగ, పట్నాల పోలమ్మ, పోరిపిరెడ్డి చాందిని, యరసాని సంధ్య, పురుపురెడ్డి మోషే, మైనర్ బాలిక, బాలుడు కలిసి ఈనెల 26న నకిరేకల్ పట్టణంలోని కో–ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లారు.

 అదే సమయంలో నకిరేకల్ మండలం నడిగూడెం గ్రామానికి చెందిన మాద నాగరాజు బంగారం లోన్ క్లీయర్ చేయడానికి రూ.3 లక్షలు కవర్​లో తీసుకొచ్చాడు. నాగరాజు ఓచర్ రాస్తుండగా నిందితులు అతడితో మాటలు కలిపి బ్లేడ్​తో కవర్ కట్​చేసి అందులోని రూ.2.50 లక్షలను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. నాగరాజు ఓచర్ రాసి చూసేసరికి కవర్​లో డబ్బు కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నకిరేకల్ బైపాస్ లోని నగేశ్ హోటల్ సమీపంలో పోలీసులు వాహనాల తనఖీ చేపట్టారు. అటుగా వచ్చిన ఏడుగురు సభ్యులను పోలీసులు ఆపి వివరాలు అడగడంతో పొంతనలేని సమాధానం చెప్పారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. వారి వద్ద నుంచి రూ.2.32 లక్షల నగదు, కారు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.