వృద్ధాప్యంలో ఏడు వేల మంది వీఆర్ఏలు

వృద్ధాప్యంలో ఏడు వేల మంది వీఆర్ఏలు
  • ఇప్పటికే వాళ్ల స్థానంలో వారసులు డ్యూటీకి
  • వారసులకు ఉద్యోగాలిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ
  • రేపటి చర్చలపై ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏలను ప్రభుత్వం ఈ నెల 20న చర్చలకు పిలిచిన నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాల అంశం చర్చనీయాంశంగా మారింది. రెండేండ్ల కింద సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పే స్కేల్ పై మాట్లాడిన సందర్భంలో 55 ఏండ్లు దాటిన వీఆర్ఏలు అడిగితే వారి వారసులకు ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో దశాబ్దాలుగా పని చేస్తున్న వీఆర్ఏల్లో సుమారు 3 వేల మందికి ఇప్పటికే 65 ఏండ్లు దాటగా.. వారికి బదులు వారి వారసులు డ్యూటీ చేస్తున్నారు. అయితే పేరు మాత్రం తండ్రిదే వస్తోంది. వారసుల సంఖ్య ఒకరికంటే ఎక్కువ ఉంటే వాటాబందీ(సంవత్సరానికి ఒకరు) పద్ధతిలో పని చేస్తున్నారు. అలాగే 55–65 ఏండ్ల మధ్య మరో 4 వేల మంది వరకు ఉన్నారు. వీళ్లు కూడా తమ వారసులకు ఉద్యోగమిస్తే తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

జాబ్ రెగ్యులరైజేషన్ పై ఆశలు

రాష్ట్రంలో వీఆర్ఏ సాంక్షన్డ్ స్ట్రెంత్ 23,046 ఉండగా, ప్రస్తుతం 21,433 మంది పని చేస్తున్నారు. ఇందులో టెన్త్ క్వాలిఫికేషన్ 3,756 మందికి ఉండగా.. 2,343 మంది ఇంటర్, డిగ్రీ, పీజీ చదివినవాళ్లు 2,909 మంది ఉన్నారు. 5 నుంచి తొమ్మిది వరకు చదివినవాళ్లు 7,200 మంది, ఎలాంటి విద్యార్హతలు లేనివాళ్లు 5,226 ఉన్నారు. డిగ్రీ, పీజీ చదివిన వీఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లపై ఆశలు పెట్టుకోగా.. మిగతావాళ్లు జాబ్ రెగ్యులరైజేషన్, పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్నారు.

65 ఏండ్లు నిండినా డ్యూటీలోనే

రాష్ట్ర సర్కార్​లో పని చేసే ఇతర ఉద్యోగుల రిటైర్​మెంట్ ఏజ్ 61 ఏండ్లు కాగా వీఆర్ఏల రిటైర్మెంట్ ఏజ్ మాత్రం 65 ఏండ్లుగా ఉంది. గతంలో చనిపోయే వరకు జాబ్ లో కొనసాగే పద్ధతి ఉండేది. కానీ ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టిన సందర్భంలో వీఆర్ఏల రిటైర్మెంట్ ఏజ్ ను 65 ఏండ్లుగా నిర్ధారించింది. మిగతావారికి ఇది వర్తించకపోవడంతో వృద్ధాప్యంలోనూ వారే కొనసాగుతున్నారు. ఆరోగ్యం సహకరించనిచోట తమ వారసులను డ్యూటీకి పంపుతున్నారు. మరికొందరు వీఆర్ఏలు వృద్ధాప్యంతో చనిపోయిన చోట వారి వారసులకు ఉద్యోగమివ్వడంలో తహసీల్దార్లు కొర్రీలు పెడుతున్నారు.
    
పేస్కేల్, వారసత్వ ఉద్యోగాలే ప్రధాన ఎజెండా

వీఆర్ఏలందరికీ పేస్కేల్ వర్తింపజేయడం, పనిచేయలేని స్థితిలో ఉన్న వారి వారసులను వీఆర్ఏలుగా తీసుకోవడం, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం.. ఈ మూడు అంశాలే మా ప్రధాన ఎజెండా. ఈ అంశాలను మేం ప్రభుత్వం ముందుపెట్టాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. 

- రమేశ్ బహదూర్, 
   కో చైర్మన్, వీఆర్ఏ జేఏసీ