తెల్లారే దాకా రెండు మూడు శవాలు ఎక్కించిండు

తెల్లారే దాకా రెండు మూడు శవాలు ఎక్కించిండు

ఎండ భగ భగ మండిపోతుంది. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్ స్టేషన్​లోకి ఆయాసంగా వచ్చి ఆగిన బస్సు చల్లని ప్లాట్​ఫామ్ నీడలో సేద తీరుతోంది. ఆ బస్సు దిగి రయ్యిన హోటల్​లోకి వెళ్ళి కూర్చున్నాడు పదిహేడేండ్ల భాస్కర్. 

‘‘బాబూ జల్ది అన్నం తీస్కరా?” అని ఆర్డరిచ్చాడు. 
‘‘ఇగో అన్నా..!” అంటూ వెంటనే తెచ్చాడు సర్వర్. భాస్కర్ మనసేమీ బాగా లేదు. ఆకలి దంచేస్తుంది. నోటికి ఏవీ రుచించడం లేదు. అమ్మ చేసే కమ్మని రుచులను గుర్తుకు తెచ్చుకుంటూ తింటున్నాడు. ముందు రోజు ఇంట్లో జరిగిన గొడవే కళ్ళ ముందు కదులుతోంది. ‘‘అందుకేరా నీకు సదువొద్దనేది. నువ్వేదో సదువుకుంటవనీ ఇంగేదో యెల్గ బెడ్తవనుకుంటె ఈ శెర్వాకమేందిరా? నా కడుపున షెడ బుట్టినవ్ గదరా. గింత గింత పిల్లలకెంతో తెలివి. నీకు రాదేందిరా.. బుద్ధి? పెద్దోన్ని చూశన్న సిగ్గు తెచ్చుకోరాదురా ?” అని శశిధర్​ని చూపిస్తూ ఎర్రబడ్డ మొహంతో భాస్కర్​ని తిడుతున్నాడు తండ్రి కిష్టయ్య 

కిష్టయ్యది నల్లగొండ జిల్లా చండూరుకు దగ్గర్లోని చిన్న గ్రామం. కౌలు చేసుకుంటూ బతుకుతున్న  నిరుపేద దళిత కుటుంబం. భార్య రాజమ్మ, ఇద్దరు కొడుకులు. కొడుకులను ప్రయోజకులను చెయ్యాలనే ఆశ. పెద్దోడు శశిధర్ ప్రైవేటు టీచర్​గా కొంత సంతృప్తినిచ్చాడు. చిన్నోడు భాస్కర్ పదో తరగతి రెండేండ్లుగా చదువుతున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులకు మింగుడు పడటం లేదు. పైగా మాటి మాటికి ఎదురు మాట్లాడతాడు. ఆ ప్రవర్తనతో భాస్కర్ ఏమైపోతాడోనని ఎక్కువగా బాధపడేవారు. ఒక రోజు భాస్కర్​తో ‘‘ఈసారన్నా పరీక్షలు మంచిగ రాయిరా” అని గుర్తుచేసాడు కిష్టయ్య.
‘‘నన్నెప్పుడు బాయి కాడికి పొమ్మంటరు. బర్ల కాడికి పంప్తరు. మీరేమన్న టూషన్ పెట్టించిండ్రా? ఊకనే యేడంగ పాసయిత?” అన్నడ భాస్కర్​. 

‘‘బాయికాడ పంజేస్కుంట ఎంతమంది సదువుతలేర్రా! అందరు టూషన్లతోనే పాసవుతున్నరా ఏందీ? నువ్వు ఒక్కనాడన్నా పుస్తకం ముడుతున్నావుర? నీకు శేతగాక ఇవుతలోల్లని అంటె ఏం లాభం?’’ కోపం చేసిండు అన్న శశిధర్. తల్లి రాజమ్మ ‘‘ఆన్నెందుకు కాల్చుక తింటున్నరు, ఆనెంట ఎందుకు బడ్తున్నరు. ఆడే సదువుతడు తీయిండ్రి ?” అంది.‘‘అమ్మా! నువ్వెనుకేస్క రాకు? నీ లాడు వల్లనే ఆడట్ల మొండోడు తయారైతుండ’’ అన్నడు శశిధర్.

‘‘అటు సదువుకూ శేత గాక పాయె. ఇటు పనికీ ఒల్లొంగుత లేదాయె. గాడ్ది లెక్క నిచ్చ ఊర్లు బట్కొని తిరుగుడేందో! అరేయ్ నీ మొగం నాకు సూపియ్యకురా..’’ గట్టిగనే మందలించాడు కిష్టయ్య. ‘‘ఆ ఏందీ.. నేను ఏ పనీ చెయ్య. ఊకె సదువూ.. సదువనుకుంట నా ఇజ్జతంత తీస్తున్నరు. ఎట్ల సదువాలె? నా దోస్తుగాళ్లకు ఇండ్లు మంచిగున్నవి. మనదేమో ఇంకా గుడిసేనాయే. అవుతల ఆడ కట్టోల్లకు రెండు కార్లున్నయ్. మనకు సిన్న సైకిల్ కూడా లేక పాయె” పేదరికాన్ని ఈసడించుకున్నట్లు భాస్కర్ మాట్లాడుతుంటే ‘‘ఆళ్ళ జోలి మనకెందుకురా? పులిని జూసి నక్క వాతలు బెట్టుకున్నట్లు” నెమ్మదిగా చెప్పాడు కిష్టయ్య.

‘‘అవునవును మాటలకేంది? మస్త్​ చెప్తరు మీ మాటల్తోటి ఎవ్వని సావు ఆన్నే సావుండ్రంటరు. ఏమన్న పట్టించుకుంటరా మీరు?’’‘‘ఏందిరా... మాటలెక్కు వైతున్నయ్? నీకు బాగ తిండెక్కువైందిరా” అంటూ వంగపెట్టి వీపు విమానం మోత మోగించాడు శశిధర్. ‘‘అయ్యో! ఏందిరా అట్ల కొట్లాడుతున్నరూ? మీ కోపాల మీద మన్ను బడా” అంటూ రాజమ్మ ఇద్దరినీ విడిపించింది. భాస్కర్ మీద మరింత కోపంతో ‘‘ఏందిరా... నువ్వు తిండికి బంటువు. పనికి దొంగవు. నలుగురి ముందల బొందల పడేస్తవేందిరా? గిట్ల అడ్డమైన కూతలు  కూస్తందుకేనార నిన్ను కన్నది..?” అంటూ సోకాలు పెట్టి ఏడ్చింది. కిష్టయ్యకు కూడా కోపం ఎక్కువైంది ‘‘అరేయ్. నేను చెప్పినట్లు యిని బుద్ధిగ సదువుకో. యినకపోతే నీ కాళ్లు ఇరగ్గొడత” భాస్కర్​కి తెగేసి చెప్పాడు కిష్టయ్య.

మొండిపట్టు వీడని భాస్కర్ ఆ రాత్రి ఇంట్లో ఉన్న రెండువేల రూపాయలు దొంగతనం చేసి పొద్దున్నే హైదరాబాద్ బస్​ ఎక్కాడు. ఏదో కొత్త ప్రపంచంలోకి వస్తున్నట్లు అనుకున్నాడు. డబ్బులు బాగా సంపాదించాలి. జీవితంలో ఎప్పటికీ ఊరికి రాకూడదు అనుకున్నాడు. హైదరాబాద్​లో బంగారులోకమేదో కనిపిస్తుందన్న ఆశతో ఇంటినుండి బయటికెళ్ళడమే సరైన డెసిషన్​ అనుకున్నాడు. తాను ఊహించిన కలల ప్రపంచం ఒకటయితే... బస్సు ప్రయాణంలో ఎదురవుతున్న సంఘటనలు మరో వైపు దారి చూపుతున్నాయి. ఊర్లలో బస్సు ఆగినపుడు కనిపించిన దృశ్యాలు భాస్కర్​లో కొత్త  ఆలోచనలు రేకెత్తించాయి. కాలు సరిగా లేకపోయినా ఎగుడు దిగుడు అడుగులతో నెత్తిన కట్టెల మోపు ఎత్తుకు పోతున్న అబ్బాయిని చూసాడు. మరోచోట ‘‘కూరగాయలో...” అంటూ కట్టె సాయంతో అవ్వ ముందల నడుస్తుంటే వెనక కూరగాయల గంప నెత్తిన మోస్తున్న పిలగాడు... అలాంటి దృశ్యాలు చూసి చలించిపోయాడు. మెల్లగా హృదయం బరువెక్కుతోంది. ‘‘నేను ఇంటినుంచి బయటకొచ్చి ఎంత పని చేసాను? ఇప్పుడెలా? తిరిగి ఇంటికి వెళ్తే బాగుంటుందా?” అని మదనపడుతుండగానే  ‘‘ఇగో అన్నా బిల్లు” అనే సర్వర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు భాస్కర్. ఎన్ని గుర్తుకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఊరికి మాత్రం వెళ్ళొద్దనుకున్నాడు. 

తిన్నాక హోటల్ నుండి రోడ్డు మీదికొచ్చి కనబడుతున్న కొన్ని దుకాణాల్లో  పని కోసం అడిగి చూసాడు. ‘‘ఏం చదివినవ్? డిగ్రీ? పీజీ?”అని అడిగారే కానీ ఎవరూ పనివ్వలేదు. చాలాసేపు తిరిగి అలసిపోయాడు. ఒకవైపు నిద్ర, మరొకవైపు చీకటి. ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో ఎటూ తోస్తలేదు. ‘‘చేతికి ఏ పనీ దొరక్కపాయె’’ అనుకుంటూ నిరాశతో మళ్లీ బస్ స్టేషన్ దిక్కు నడక మొదలుపెట్టిండు. అక్కడయితే ప్లాట్ ఫాంలో కూర్చొని కాసేపు కునుకు తీద్దాం అనే ఆలోచన. ‘‘బాబూ! ఏడికి పోవాలె?’’ ఎదురుగా వస్తున్న పొడవైన తెల్ల బట్టల నల్ల ముఖం మనిషి అడిగాడు. ‘‘నేను బస్టాండ్ దాకా పోతున్న. నాకేదన్న పని దొరుకుద్దేమోనని దేవులాడుతున్న”

‘‘ఏం సదువుకున్నవ్? ఏ పనైనా చేస్తవా?’’‘‘నేను తక్కువనే సదువుకున్న గానీ దొంగతనం తప్ప ఏ పనైనా చేస్త”‘‘గీడ..దావకాన్ల శిన్న పనుంది. ఇయ్యాల తెల్లందాకా జెయ్యాలె. వస్తవా?’’
‘‘వస్త గాని ఏం పని?’’‘‘ఏమీ లేదు. పీనుగలను మోస్క బోవాలె”‘‘అమ్మో..! నేన్జెయ్య, నావల్ల కాదు”‘‘ఇప్పుడేగా ఏ పనున్నా చేస్తనంటివి?’’‘‘అన్నగాని, ఆ పీనుగల్ని ఎట్ల మొయ్యాలె’’‘‘నీకు జోడిగా ఇంకోడుంటడు. ఆన్తోటి దావకాన్ల లోపలికెల్లి స్ట్రెచర్ మీద తీసుకొచ్చి అంబులెన్స్​ల ఎక్కియ్యాల”‘‘మరి పైసలెన్నిస్తవ్..?’’‘‘నువ్వు అడిగినన్నిస్తం. వస్తవా? రావా?”‘‘వస్తా గానీ, లెక్కతప్పొద్దు మరి”అన్నడు భాస్కర్​.

ఆ రాత్రి తెల్లారే దాకా రెండు మూడు శవాలు ఎక్కించిండు. దించిండు. తెల్లారే వరకు నిద్ర లేకుండా పనిచేసినా జేబులోకి మాత్రం డబ్బులు రాలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న పైసల్లో మిగిలినవి కూడా మాయమైనవి. అడుగుదామంటే తెల్లబట్టల నల్లముఖం వాడి మోసం ముందు జేబు ఖాళీ అయి భాస్కర్ ముఖం సన్నగై చిన్నబోయింది.నిద్ర లేకుండా చేసిన పనికి లాభం రాక నిరాశతో అక్కడి నుండి మళ్ళీ రోడ్డెక్కాడు. మెల్లగా నడుచుకుంటూ రోడ్డు పక్కన ఉన్న నాలుగైదు హోటళ్లలో ‘పనిచేస్తాన’ని అడిగి చూసాడు. కుదరక చివరికి రోడ్డు పక్కన ఉన్న గుడిసె హోటల్ కెళ్ళి సర్వర్ పనితో పాటు ఏ పనైనా చేయడానికి రెడీ అయ్యాడు. అలా వారం రోజులు చేశాక తన మీద తనకు తీవ్రమైన అసంతృప్తి కలిగింది. దాంతో అప్పటివరకు చేసిన పనికి లెక్క తీసుకుని అక్కడ పరిచయమైన చందూతో కలిసి బయటికొచ్చాడు. చందుది సిటీలో చాదర్ ఘాట్ రోడ్డు వంతెన కింద మూసీ నదికి ఆనుకొని ఉన్న మురికివాడ. అక్కడ చందు తాత దూడల పెంటయ్య ఆది హిందూ భవన్ ముందరి చౌరస్తాలో రోడ్డు మీద ఓ మూల చెప్పులు కుడతాడు. ఆ తాత దగ్గరకి భాస్కర్​ని తీసుకెళ్లాడు చందు.  

‘‘ఏం రా.. శెందూ ఎవల్నో ఎంటపెట్టుకొచ్చి నవ్?’’‘‘ఏం లేదు తాతా. ఈడు నా దోస్తు భాస్కర్. ఏదన్నా పని కావాలంటే నువ్వు చెప్తవని తీసుకొచ్చిన’’‘‘ఏడంగొచ్చిన్రా దోస్తుగాడు”‘‘మనూరి దిక్కే తాతా. మనోల్లే.. దూరం సుట్టాలైతరంట”‘‘అట్లనారా. మన పెద్ద మేస్త్రి గాడు ఇమాలిగానికి తోల్క పొమ్మని జెప్త. ఆ పనికి పోతాడా?’’‘‘నేనేం భయపడన్తా తాతా. నాకు కూలి సక్కగిస్తే సాలు. నా యెంట చందుగాడుంటడుగా” భాస్కర్​ జవాబిచ్చాడు. ఇమాలి మేస్త్రి కింద చందూతో కలిసి భాస్కర్ మూడు వారాల పాటు పనిలో తట్ట పట్టి ఒళ్ళు వంచాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చిన డబ్బులు ఆ వారం నాడే ఖర్చైపోతున్నాయి. ఈ పద్ధతి భాస్కర్​కి నచ్చలేదు.‘‘అరే చందూ. ఈ పని నాకేం మంచిగనిపిస్తలేదురా”‘‘ఏమైంది బే.. ఒల్లొంగుతా లేదా ఏంది?’’‘‘అది కాదురా... ఈ పైసల్తోటి అర్కత్ లేదు, బర్కత్ లేదు. పైసలు వచ్చినయ్ వచ్చినట్టు దంచుడు, బుక్కుడుకే అయితున్నయ్”‘‘అరేయ్ బేకార్​గా ఏం శేతనైతదిరా నీకు?’’ ‘‘మొన్న దిల్​సుఖ్​నగర్​ల పని చేస్తన్నప్పుడు ఇల్లుగల్లాయన చెప్పిండు. ఆటో నగర్ల ఆయనకు తెలిసిన టైర్ల కంపెనీ ఉందంట. నెల నిండా జీతం. ఉంటందుకు రూమ్ కూడా ఇస్తరంట. ఆడికే పోతరా’’ ‘‘అరేయ్... మొండి మొకపోడా. పో..బే....! నీ ఇష్టం వచ్చినట్టు చేస్కో పో” అని కోపంగా అన్నడు చందు.
       *   *   *
ఆటోనగర్​లో ఉన్న టైర్ కంపెనీలో రోలర్ మిషన్ ఆపరేటర్ కింద హెల్పర్​గా మాట్లాడుకున్నాడు. ఆ కంపెనీలో షిఫ్ట్​కి 60 మంది వర్కర్లతో మొత్తం180 మంది వరకు వర్కర్లు మూడు షిఫ్టుల వారీగా పనిచేయాలి. రోలర్ మిషన్​లో జింక్, కార్బన్ పౌడర్, పాల రబ్బర్ కార్డులు, మరికొన్ని కెమికల్స్ వేసి రబ్బర్ తయారుచేయాలి. ఆపరేటర్ సుధాకర్ రూమ్​లోనే ఉంటూ భాస్కర్ పనిచేస్తున్నాడు. కానీ వారం వారం పనిచేసే టైం మారుతుండడంతో భాస్కర్ ఆరోగ్యం పాడైంది. నెలరోజులు పని చేసి జీతం తీసుకున్నాడు. రెండో నెల మొదలైంది. కంపెనీ వర్కర్లతో స్నేహం పెరిగింది. దురలవాట్లు అయ్యాయి. అలా ఒకరోజు మందు తాగి రాత్రి షిఫ్టుకి వెళ్ళాడు. పనిచేస్తున్నప్పుడు సుమారు మూడు గంటలప్పుడు రోలర్ మిషన్ తిప్పేటప్పుడు కంటి మీదకి కునుకు రావడంతో నడుస్తున్న రోలర్ల మధ్యలో ఎడమ చేతి చిటికెన వేలు ఇరుక్కున్నది. ‘అమ్మా.. అయ్యా..’ అని పెద్దగా అరిచాడు భాస్కర్. ఆపరేటర్ సుధాకర్ వెంటనే మిషన్ ఆపేసి భాస్కర్ చేతిని మెల్లగా బయటకు తీశాడు. చిటికెన వేలు మిషన్లో కొద్దిగా నలిగింది. ఆ బాధ తట్టుకుంటూనే మరో నెల రోజులు పని చేశాడు. రోలర్ మిషన్ నుండి ఎగిరిపడే నల్లని కార్బన్ పౌడర్ తుపాన్​ని భరించడం కష్టమయ్యేది. రోజూ డ్యూటీ అయిపోయాక బెల్లం, అరటిపండు తప్పక తినాలి. కానీ భాస్కర్ ఆ జాగ్రత్తలేవీ  పాటించలేదు. దాంతో ఆరోగ్యం పాడైంది. చిన్న దగ్గు మొదలై కొన్ని రోజులకు ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయనే విషయం తెలిసింది. దాంతో టైర్ కంపెనీలో పని మానేశాడు. కానీ ఆపరేటర్ సుధాకర్ రూమ్​లోనే ఉంటూ ఆరోగ్యం బాగయ్యాక దగ్గర్లోని బ్యాటరీ ప్లేట్లు తయారయ్యే మరో కంపెనీకి వెళ్ళాడు. అది టైర్ కంపెనీ అంత పెద్దది కాదు. నలుగురు పని చేసే కుటీర పరిశ్రమ లాంటిది. ఆ కంపెనీలోకెళ్ళాడు. 

‘‘నమస్తే అన్నా. ఇక్కడ పనేమన్నా దొరుకుతదా” అని అడిగాడు.‘‘హిందీ మే బోలో” అన్నడు ఓనర్​.‘‘ఇదర్ కామ్ దొరుకుతదా?”అని అడిగిండు భాస్కర్.‘‘కామ్ తో హర్ రోజ్ మిలేగా. తుమ్ తో రోజ్ ఆవోగేనా?” అని అడిగాడు. పక్కనే ఉన్న వేడివేడి బాయిలర్​లో బరువైన సీసం కడీలు వేస్తూ. అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్న నన్కూ భాయ్ పటేల్ (భయ్యా).
‘‘రోజు వస్త గని ముక్కులకు కార్బన్ పౌడర్, దుమ్ము గిట్ల ఏం పోదు కదా?’ అని అడిగిండు.‘‘యహా కామ్ తుమ్ దిల్సే కరో. తుమ్ కో అచ్చా రహేగా. కర్నేవాలా కామ్ మే దిల్ నహీ హైతో ఔర్ కోయీ కుచ్ నహీ కర్ సక్తే. తుమారా నామ్ బతావ్..’’‘‘భాస్కర్.  పని ఎట్లా ఉంటదో జెర చెప్పరాదుండ్రి’’‘‘అచ్చా భాస్కర్.. 40 కిలోల సీసం కడీలు పకడ్ కే, బాయిలర్ మే డాల్ నా. దిన్ భర్ మెహనత్ కర్నా పడ్తా. యహీ కామ్ హై, సమ్​ఝా?’’ ఈ కంపెనీ పనిని టైర్ కంపెనీ కంటే చాలా బాగుంటుందని ఒప్పుకున్నాడు భాస్కర్. కానీ తన బక్క పల్చని శరీరంతో 40 కిలోల సీసం కడీల బరువు లేపడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. బాయిలర్ దగ్గర వేడిని భరించడం చాలా కష్టమయ్యేది. పైగా తిండి సరిగ్గా లేక వారంలో రెండు మూడు రోజులు వాంతులు, విరేచనాలు అయ్యేవి. ఒక రోజు పనిలో ఉన్నప్పుడు ‘‘క్యా.. హో భాస్కర్? క్యా సోచ్ రా.  క్యోం.. రో..రా భయ్యా?” అంటూ నన్ను ఆత్మీయంగా అడిగాడు. ‘‘ఏం లేదు భయ్యా.  మా అమ్మా నాయినలు యాది కొచ్చిండ్రు” అని తన గురించి చెప్పాడు.‘‘దేఖో భాస్కర్. తుమ్ కో మా బాప్ హై. బడా భాయీ భీ హై. లేకిన్ తుమ్ పూరీ తరా పడేతో క్యా హోతా? యే కామ్ కర్నేకా క్యా జరూరత్ హై?” ‘‘నాక్కూడా చదువుకోవాలని ఉండె భయ్యా. కానీ మా ఇంట్ల అందరితో కొట్లాడి పట్నం వచ్చిన. ఇంత జరిగినంక నాకిప్పుడింకా సదువెందుకనిపిస్తుంది భయ్యా.”‘‘అరే.. కుచ్ నహీ హోతా. తుమ్ కో పడ్ నే కా ఉమర్ హై” ‘‘సూడు భయ్యా..! నాకు సదువొద్దు. గిదువొద్దు. ఏదో ఒక పని జెయ్యాలె. పైసలు సంపాయించాలె. మా వోల్ల మొఖం మీద కొట్టినట్టు బతకాలె” అన్నడు.‘‘అరే భాస్కర్. తూ ఆద్మీ హై. జాన్వర్ హై.  మై జో బోల్ రహాహూనా. తుమ్ సున్తా భీ నహీ. యే పైసే జో హై నా.. కభీ భీ ఫాల్తూ కామ్ కరాతా హై. ఆద్మీ కే జైసా దిఖాతా భీ నహీ.’’‘‘లేదు భయ్యా. నువ్వెన్నన్న జెప్పు నేను సదువ నంటే సదువ.’’‘‘అచ్చా... టీక్.. హై భాస్కర్ ఏక్ కామ్ తో సీఖ్ లో నా”‘‘అవును భయ్యా. ఈడికి నేనొచ్చిన సంది నా పానం బాగుంటలేదు. ఈ పనిజెయ్య బుద్ధయితలేదు.’’‘‘ఇదర్ కామ్ చోడ్ కే క్యా కరేగా..?’’‘‘గాడ బరువులు మొయ్యని పనుందట. నా దోస్తుగాడు సుధాకర్ జెప్పిండు.’’‘‘కోన్ హై వో. ఖాళీ పీలీ పైసే దేనేవాలా..?’’‘‘వైన్ షాప్​ భయ్యా. అండ్ల గ్లాసులు కడగాలి. తాగేటోల్లకు మిర్చీ బజ్జీలు, గుడాలు, ఆమ్లెట్లు, చికెన్, మటన్, బోటి, కాళ్ళశోర్వ, చాపల ఫ్రై వంటి తినేటివన్నీ తెచ్చియ్యాలంట. గిరాకోల్లు ఇచ్చే సిల్లర పైసలతో డబ్బులే డబ్బులంట’’‘‘వో దారూ కా దుకాన్ హైనా. ముజే అచ్చా నై లగ్ రహా హై. కోయి గడ్ బడ్ హువాతో పోలీస్ ఆకే లేకే జాయేంగే. ఏక్ బార్ తుమ్హారా నామ్ పోలీస్టేషన్ మే లిఖే తో పూరా జిందగీ బర్బాద్ హో జాయేగా. తుమ్ పడ్నేకో, సర్కార్ నౌకరీ కర్నే కే లియే భీ ముష్కిల్ హోగీ. జెర సొచో భాస్కర్”‘‘లేదు భయ్యా. ఏమన్నా కానీయ్. నేను ఆ వైన్ షాపుకే పోతా. ఇంత గనం ఒంగబడుడూ నా శేత కాదు. బొక్కలిరగ్గొట్టుకునుడు నా వల్ల కాదు”‘‘కిత్నే బార్ బోల్నారే. కైసే సంఝానా పడేగా తుజే. మేరే హాలత్ దేక్. కైసా హో. పచాస్ సాల్​కి ఉమర్ మే భీ యెహీ కామ్ కర్ రహా. మేరే జిందగీ భర్ యెహీ కామ్ కర్నాఈ పడేగా. నువ్వు చదువుకుంటే నీకే మంచిగైతది. అగర్ నహీ పడేతో నువ్వూ నా లెక్క జిందగీ అంతా కూలీ పని చెయ్యాలె” అని బెదిరించినట్టే చెప్పిండు భాయ్​.

‘‘నువ్వెన్నన్న జెప్పు భయ్యా. నేనా వైన్ షాపులకే పోతా. ఈ పని జేయడం నావల్ల కాద”ని చెప్పి ఆరోజు వరకు లెక్క చేసి, డబ్బులు తీసుకొని సుధాకర్ రూమ్ వైపు పోయిండు. అక్కడికి వెళ్లేసరికి రూమ్ దగ్గర చుట్టుపక్కల వాళ్లంతా గుంపుగా నిలబడి ఉన్నారు. సుధాకర్ బాగా తాగి గొడవ చేసి గల్లీలో ఇద్దరిని చితకబాదిండని కంప్లైంట్ ఇచ్చారట. పోలీసులొచ్చి సుధాకర్ మీద దొంగతనం కేసు కూడా ఉందని అరెస్ట్ చేసి తీసుకెళ్లారట. వెంటనే రూమ్ ఖాళీ చెయ్యకపోతే బాగుండదని ఓనర్​తో కలిసి భాస్కర్​ని కూడా అనుమానంతో హెచ్చరించారు.విషయం తెలుసుకున్న భాస్కర్​కి వెంటనే భాయ్​ చెప్పిన మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఓ వైపు పక్కనే ఉన్న టైలర్ షాపు ఎఫ్.ఎం.రేడియో లోంచి ‘‘అనుకున్నావని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని. అనుకోవడమే మనిషి పని” అనే పాట భాస్కర్​ చెవులకి వినపడింది. మరో వైపు హైదరాబాద్​లో పడిన అవస్థలకు, అవమానాలకు, ప్రమాదాలకు తనే కారణం అని తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను ఎదిరించి, కుటుంబాన్ని వదిలి రావడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతూ, తన్నుకొస్తున్న ఏడుపు ఆపుకుంటూ ఇమ్లీబన్ బస్ స్టేషన్ వైపు అడుగులేశాడు. బంగారు లోకానికి దారి వేసే చదువు కోసం బయల్దేరాడు.
ఫోన్​:91776 07603