ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి. కారిడార్, మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అయితే అదృష్టవశాత్తూ, భక్తులెవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. మహాకాల్ లోక్ కారిడార్ సుమారు 900 మీటర్ల పొడవుతో రూ. 850 కోట్లతో నిర్మించారు.

ఉజ్జయిని జిల్లాలో ఉరుములు పిడుగులతో కూడిన ఈ భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు కూలిపోగా.. వీటిలో రెండు ధ్వంసమయ్యాయి.

ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా గతేడాది అక్టోబరులో మొదటిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈదురు గాలులకు విగ్రహాలు కూలిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి కారణంగానే విగ్రహాలు కూలాయని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమలనాథ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహకాల్ లోక్ కారిడార్‌లోని 155 విగ్రహాల్లో ధ్వంసమైన వాటిని మరమ్మత్తు చేయిస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.