ఇందిరమ్మ ఫ్రీ ఇసుకకు ఫారెస్ట్, వీడీసీల బ్రేక్

 ఇందిరమ్మ ఫ్రీ ఇసుకకు ఫారెస్ట్, వీడీసీల బ్రేక్
  • ఇండ్ల నిర్మాణాలకు తీవ్ర ఆటంకాలు
  • కవ్వాల్ అభయారణ్యం పేరిట ఇసుక తవ్వకాలు, తరలింపునకు అడ్డంకులు
  • జిల్లాలో 21 ఇసుక రీచ్ ల గుర్తింపు
  • మండలాల వారీగా ఇసుక కోటా కేటాయింపులు
  • రవాణాకు తహసీల్దార్ అనుమతి తప్పనిసరి

నిర్మల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఓవైపు అటవీశాఖ అధికారులు, మరోవైపు ఆయా గ్రామాల వీడీసీలు పరోక్షంగా అడ్డు తగులుతున్నారు. కవ్వాల్ అభయారణ్యం పరిధి పేరిట అటవీ శాఖ ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి మండలాలకు ఆయా వాగుల నుంచి ఇసుకను తరలించకుండా అడ్డుకుంటోంది. నిర్మల్​ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 8474 ఇండ్లు మంజూరవగా ఇప్పటివరకు 4878 ఇండ్లకు లబ్ధిదారులు ముగ్గుపోసుకున్నారు. 

420 ఇండ్లు బేస్​మెంట్ లెవల్, మరో 61 ఇల్లు గోడల లెవల్​లో మాత్రమే ఉన్నాయి. కేవలం 10 ఇండ్లు మాత్రమే స్లాబ్ లెవల్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను వాగుల నుంచి తీసుకొచ్చేందుకు వీడీసీలు అడ్డుతగులుతున్నారు. 

వాగుల్లో తవ్వకాలకు అనుమతులు

జిల్లాలోని పలు వాగుల్లోని ఇసుక రీచ్​ల్లో తవ్వకాలకు అధికారులు అనుమతులు జారీ చేశారు. మైనింగ్ ఏడీ, తోపాటు గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్ ఏడీలు ఉమ్మడిగా వాగుల్లో సర్వే చేసి ఎంపిక చేసిన వాగుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించారు. మొత్తం 21 ఇసుక రీచ్​లను గుర్తించారు. జిల్లాలో మొత్తం 8474 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. వీటి కోసం 2 లక్షల 275 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని హౌసింగ్ అధికారులు నిర్ధారించారు. 

అయితే వాగుల్లో ఇంతమొత్తంలో ఇసుక నిల్వలు లేవని, సగం మాత్రమే లభ్యత ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించించి దానికనుగుణంగానే అనుమతులిచ్చారు. తహసీల్దార్​ అనుమతితో వాగుల్లోనుంచి ఇసుకను తీసుకెళ్లాలి. భైంసా రూరల్ మండలంతో పాటు భైంసా మున్సిపాలిటీ, బాసర, కుభీర్, కుంటాల, లోకేశ్వరం, ముథోల్, తానూర్, నర్సాపూర్ జి, దిలావర్​పూర్ మండలాలకు సాత్గావ్, మన్మథ్, ముత్కపల్లి, పుష్పూర్ గ్రామాల పరివాహకంలోని సుద్ద వాగు నుంచి ఇసుక తరలించాలని నిర్ణయించారు. 

నిర్మల్ రూరల్ మండలం, నిర్మల్ మున్సిపాలిటీతోపాటు సారంగాపూర్, సోన్ మండలాలకు వెంగాపేట్, బీరవెల్లి, ఆలూర్ గ్రామాల్లో ప్రవహించే స్వర్ణ నది వాగు నుంచి లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ మున్సిపాలిటీలకు నిర్వచింతల వద్ద ఉన్న చిక్మన్ వాగు నుంచి పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాలకు సమీప గోదావరి నది నుంచి ఇసుకను తరలించేందుకు 
అనుమతించారు. 

ఇసుక తరలింపునకు ఆటంకాలు

ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి, కడెం మండలాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 36,650 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. బెల్లాల్, చిట్యాల, కడెం, ఎర్వచింతల, చిక్మన్ వాగుల నుంచి ఈ ఇసుకను తరలించాలని భావించారు.

 అయితే ఈ వాగుల్లో మాత్రం 18,417 క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే తవ్వకాలకు అందుబాటులో ఉన్నట్లు మైనింగ్ అధికారులు గుర్తించి దానికి అనుగుణంగా అనుమతించారు. అయితే ఈ వాగులన్నీ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండడంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తరలింపునకు ఆటంకాలు కలిగిస్తున్నారు. దీంతో తప్పనిపరిస్థితుల్లో కొంతమంది లబ్ధిదారులు ఇసుకను ప్రైవేట్​లో కొంటుండడంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. 

వీడీసీలకు మింగుడుపడడంలేదు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఫ్రీగా వాగుల నుంచి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతించడం వీడీసీలకు మింగుడు పడడంలేదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వీడీసీలు తమ పరిధిలోని వాగుల్లోని ఇసుక రీచ్​లకు అనధికారికంగా రూ.లక్షల్లో టెండర్లు నిర్వహించి  ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాయి. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తమ పరిధిలోని వాగుల నుంచి ఇసుకను ఇవ్వకుండా అడ్డుకుంటున్నాయి. సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో స్వర్ణ వాగు ఇసుక రీచ్ నుంచి ఇసుక తెచ్చుకునేందుకు అక్కడి వీడీసీ అడ్డుకుంటుండడం వివాదాస్పదమవుతోంది. అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికీ తవ్వకాలు జరగడం లేదు. 

ఇసుక తరలింపునకు అనుమతులు లేవు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం అటవీ ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలు, తరలింపునకు ఎలాంటి అనుమతులు జారీ కాలేదు. అటవీ భూభాగం నుంచి ఇసుకను ఇవ్వాలని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రాలేదు. కవ్వాల్ టైగర్ జోన్ నుంచి గానీ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గాని ఇసుకను తరలించడంపై నిషేధం ఉంది.కిరణ్ కుమార్, ఎఫ్ఆర్వో, ఖానాపూర్, నిర్మల్ జిల్లా