
రోడ్డుపై పారుతున్న మురుగుతో వాహనదారులు, పాదచారులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట నుంచి కూకట్ పల్లికి వైపుకు వెళ్లే బస్టాపు నుండి విజేత సూపర్ మార్కెట్ వరకు రోడ్డు కింది సైడ్ నీటితో నిండి పోయింది. పాదచారులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్బీఐ బ్యాంకుకు వచ్చే వారు అలాగే విజేత సూపర్ మార్కెట్ కు వచ్చే జనం ఆ మురుగు నీటిలోంచి నడవ లేక అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు, షాపింగ్ కు బైక్ లపై వచ్చే వారు నీటి గుంత ఎంత లోతు ఉందో తెలియక, తమ బైక్లను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా నీరు నిల్వ ఉండడంతో రోడ్డు పక్కన మట్టి కొట్టుకు పోయింది. రోడ్డు కోసుకుపోయి రోడ్డు పక్కన పెద్ద కయ్యలాగా మారడంతో ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది కార్యాలయానికి ప్రతి రోజు ఆ దారిలోనే వెళతారు. కూత వేటు దూరంలో ఉన్నా రోడ్డు పైన పారుతున్న మురుగునీరు, నీటి గుంతలు కనపించడం లేదా అని ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కరోజు రెండు రోజులు కాదు వారం రోజులుగా ఇదే పరిస్థితి అని వెంటనే మున్సిపల్ అధికారులు మరుగు నీటి సమప్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.