వివాహేతర శృంగారం నేరం కాదు: రాజస్థాన్ హైకోర్టు

వివాహేతర శృంగారం నేరం కాదు: రాజస్థాన్ హైకోర్టు

ఇద్దరు మేజర్లు వివాహేతర సమ్మతితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడటాన్ని నేరంగా పరిగణించలేమని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. 

ఈ కేసులో దరఖాస్తుదారుడు వేరే నేరానికి జైలులో ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోయాడు. ఈ సమయంలో, అతని భార్య కోర్టుకు హాజరయ్యింది. తనను కిడ్నాప్ చేశారన్నది అవాస్తవమని, తాను నిందితులలో ఒకరితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ, వివాహేతర సంబంధాన్ని దరఖాస్తుదారుడి భార్య అంగీకరించిందని తెలిపారు. అందుకుగానూ  IPC సెక్షన్ 494 (భర్త లేదా భార్య జీవితకాలంలో మళ్లీ వివాహం చేసుకోవడం), 497 (వ్యభిచారం) కింద నేరంగా పరిగణించి శిక్షించాలని వాదించారు. 

అయితే, ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు చెప్పింది. తీర్పు సందర్భంగా, జస్టిస్ బీరేంద్ర కుమార్ భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 497 ప్రకారం వ్యభిచారం నేరం మినహాయింపు అని తెలిపారు. ఈ పిటిషన్‌లో ఎటువంటి అర్హత లేదని గుర్తించిన కోర్టు దాన్ని కొట్టివేసింది.