జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి: ఎస్ఎఫ్​ఐ డిమాండ్

జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి: ఎస్ఎఫ్​ఐ డిమాండ్

ఓయూ, వెలుగు: జనగామ జిల్లా పేరును దొడ్డి కొమురయ్య జిల్లాగా మార్చాలని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్​ ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ ​కాలేజీ ఎదుట  దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. 

నిజాం కాలంలో భూస్వాములు, పటేల్, పట్వారీలు ప్రజల నుంచి బలవంతపు, అక్రమ వన్నులను ఆపాలని, వెట్టి చాకిరీని రద్దు చేయాలని కొమురయ్య పోరాటం చేశారన్నారు. ఆయన త్యాగం, పోరాటం, బలిదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. కొమురయ్య వర్ధంతిని తెలంగాణ రైతు దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, ఉపాధ్యక్షుడు రామటెంకి శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.