శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో శబరి స్మృతి యాత్ర

శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో శబరి స్మృతి యాత్ర

భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో అపరభక్తురాలు శబరి స్మృతి యాత్రను ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలతో భద్రాచలంలో శోభాయాత్ర నిర్వహించారు. రేలా, కొమ్ము నృత్యాలతో పాటు నాయకపోడు కళారూపాలు కనువిందు చేశాయి. ముందుగా శబరి చిత్రపటంతో గర్భగుడిలో శ్రీ సీతారాముల వారికి కేశవనామార్చన చేశారు. ఈ సందర్భంగా శబరికి స్వామి తరుపున శేషమాలికలు, శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం శబరి చిత్రపటంతో ఆదివాసీల కళారూపాలతో భద్రాచలంలో శోభాయాత్ర నిర్వహించారు. రెండుసార్లు భద్రగిరి ప్రదక్షిణ చేసి మూడోసారి శోభాయాత్రగా బయలుదేరారు. శబరి చిత్రపటంతో పాటు చిత్రకూట మండపానికి చేరుకున్న ఆదివాసీలు శ్రీసీతారామచంద్రస్వామికి కల్యాణం జరిపించారు. వారు అడవుల్లో దొరికే పుష్పాలు, ఫలాలను రామయ్యకు నివేదించారు. కల్యాణం అనంతరం దేవస్థానం ఈవో శివాజీ ఆదివాసీలకు ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. 

భక్తులతో రామాలయం రద్దీ
దసరా సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం రామాలయం భక్తులతో రద్దీగామారింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం గర్భగుడిలో రామయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఒంగోలుకు చెందిన సింగంరెడ్డి హిమబిందు రూ.50 వేలు, హైదరాబాద్​కు చెందిన శ్రీలక్ష్మి రూ.లక్ష, విజయవాడకు చెందిన యలమాటి ప్రణీత్​చౌదరి రూ.1,00,116 స్వామివారి నిత్యాన్నదాన పథకానికి విరాళంగా ఇచ్చారు.