ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ఉండవు

ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ఉండవు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో అవిశ్వాసం తీర్మానంపై జరిగిన ఓటింగ్లో ఓటమితో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. దీంతో పాక్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ చీఫ్ షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  అవిశ్వాసం ముగిసిన అనంతరం షెహబాజ్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. తీవ్ర సంక్షోభం నుంచి పాకిస్థాన్తో పాటు పార్లమెంటు విముక్తి పొందిందని అన్నారు. కొత్త ఉదయానికి స్వాగతం పలుకుతున్నామన్న ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని.. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు 174మంది సభ్యుల మద్దతుంది. ఈ క్రమంలో కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పాక్ నేషనల్ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం కానుంది. అవిశ్వాసం ద్వారా అధికారం కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ చరిత్రలో నిలిచిపోయారు.