అయ్యయ్యో ఎంత పనాయా.. పొరబడ్డ పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు.. నెట్టింట ట్రోల్స్

అయ్యయ్యో ఎంత పనాయా.. పొరబడ్డ పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు.. నెట్టింట ట్రోల్స్

పాకిస్తాన్ స్పీడ్‌స్టర్, ఆ జట్టు మాజీ దిగ్గజం షాహిద్ ఆఫ్రిదీ అల్లుడు.. షాహీన్ షా ఆఫ్రిది నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అందుకు కారణం ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నోరు జారటమే. 

ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల సందర్బంగా పాక్ మాజీ ఆటగాళ్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జకా అష్రఫ్.. ఐసీసీ టాప్-10 బ్యాటర్లలో షాహీన్ ఆఫ్రిది ఒక్కడని కొనియాడారు. అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు. పాక్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన ఈ రాజకీయ ఉద్ధండుడు.. ఈసారి ఆసియా కప్ 2023 తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

 "బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాకిస్తాన్ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్ గురించి మాట్లాడితే.. కెప్టెన్ బాబర్ ఆజం ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. షాహీన్ షా ఆఫ్రిది టాప్-10 బ్యాటర్‌గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే.. ఐసీసీ టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఐదు మనవే. పాకిస్తాన్ జట్టు ఆడుతున్న తీరుకు గర్వపడుతున్నా. రాబోవు రోజుల్లో మరింత బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.." అని అష్రఫ్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ఈ మాటలే ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిని, ఆ జట్టు ఆటగాళ్లను నవ్వులు పాలు చేశాయి. బౌలర్‌కు .. బ్యాటర్‌కు తేడా తెలియని వారిని పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. మీ జట్టులో 11 మంది బ్యాటర్లే.. ఆ బలాన్ని చూపించుకోవడానికే జింబాబ్వేతో మ్యాచులు ఆడతారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఒక్కమాటతో షాహిద్ ఆఫ్రిదీ అల్లుడికి మంచి పాపులారిటీ వచ్చేసిందని చెప్పాలి.

కాగా, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ నంబర్‌వన్ స్థానంలో ఉండగా, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షాహీన్ ఆఫ్రిది.. ఐసీసీ  బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

ఆసియా కప్‌ 2023లో భాగంగా ఇండియా- పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా జరగనుంది.