భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: శైలజా రామయ్యర్​​

భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: శైలజా రామయ్యర్​​

భద్రాచలం, వెలుగు : ప్రసాద్​ స్కీంలో ఉన్న పనులన్నీ తొందరగా పూర్తి చేసి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎండోమెంట్, టూరిజం ప్రిన్సిపల్​ సెక్రటరీ శైలజారామన్​ అయ్యర్​ అధికారులను ఆదేశించారు. కమిషనర్​ హన్మంతరావు, కలెక్టర్​ ప్రియాంక అల, పీవో ప్రతీక్​జైన్​లతో కలిసి ఆమె భద్రాచలం, పర్ణశాలల్లో ప్రసాద్​ స్కీం ద్వారా రూ.42కోట్లతో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ముందుగా పర్ణశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూమిని సీతమ్మసాగర్​ కరకట్ట పనుల కోసం వెనక్కి తీసుకోవడంతో వేరే చోట స్థలం చూడాలన్నారు. 

తర్వాత భద్రాచలంలో మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి పనులను చూశారు. ఆలయంలో రూఫింగ్, లడ్డూ తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రసాద్​ స్కీంలో ఉన్న పనులన్నీ శ్రీరామనవమి తర్వాత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాస్టర్​ ప్లాన్​ ప్రకారం చేపట్టబోయే పనుల గురించి ఆరా తీశారు. మాఢవీధులు, ప్రాకారాల నిర్మాణాల కోసం చేపట్టబోయే భూసేకరణ గురించి చర్చించారు. గుడి చుట్టూ ఉన్న ఇండ్ల యజమానులతో మాట్లాడి అవసరమైన భూమిని సేకరించాలని కలెక్టర్​కు సూచించారు. తర్వాత రంగనాయకుల గుట్టపై సీతానిలయంలో మాస్టర్ ప్లాన్​ ప్రకారం చేపట్టాల్సిన పనులపై రివ్యూ చేశారు. ఆలయంలో మరో లిఫ్ట్ ను  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రామదాసు కాలం నాటి నిర్మాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా నిర్మాణాలను కొనసాగించాలని అర్చకులు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఈవోలను అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ఆలయంలో మ్యాట్​లను ఏర్పాటు చేయాలన్నారు.  పురుషోత్తపట్నం భూముల్లో నిర్మించిన గోశాలను సందర్శించారు.