వికెట్లు తన్నేసి.. నేలకు కొట్టి అంపైర్​తో గొడవ

వికెట్లు తన్నేసి.. నేలకు కొట్టి అంపైర్​తో గొడవ


ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్​షకీబ్‌‌‌‌‌‌‌‌ అల్ హసన్‌‌‌‌‌‌‌‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అంపైర్  ఎల్బీడబ్ల్యూ ఇవ్వలేదన్న కోపంతో గొడవకు దిగాడు. కోపం పట్టలేక వికెట్లను తన్నేశాడు. తర్వాత వర్షం కారణంగా ఆటను నిలిపివేయడంపై అభ్యంతరం తెలుపుతూ అంపైర్​ మీదకు దూసుకొచ్చి వికెట్లను తీసి విసిరేశాడు. తర్వాత సారీ చెప్పాడు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా పశ్చాతాపం వ్యక్తం చేశాడు. ఢాకా ప్రీమియర్​ లీగ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం మొహమ్మదన్‌‌‌‌‌‌‌‌ స్పోర్టింగ్, అబహాని లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఈ వివాదం జరిగింది. స్పోర్టింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న షకీబ్ తాను బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఓవర్లో  ప్రత్యర్థి ఆటగాడు ముష్ఫికర్​ రహీమ్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ కోసం అప్పీల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అంపైర్ ఔటివ్వకపోవడంతో క్షణాల్లోనే నాన్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ ఎండ్‌‌‌‌‌‌‌‌ వికెట్లను తన్నేశాడు. అంతటితో  స్టార్​ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్​ ఆగిపోలేదు.  ఆరో ఓవర్లో మరో బాల్‌‌‌‌‌‌‌‌ మిగిలున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో వర్షం రావడంతో  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ అంపైర్లు ఆటను నిలిపివేశారు. దీనిపై షకీబ్‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో బాల్‌‌‌‌‌‌‌‌ పడితే ఆరు ఓవర్లు పూర్తయ్యి, డక్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌  ప్రకారం విజేతను ప్రకటించొచ్చంటూ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో మిడాఫ్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న తను కోపంతో ఊగిపోతూ అంపైర్​ మీదకు దూసుకొచ్చాడు. ఈసారి నాన్‌‌‌‌‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ ఎండ్‌‌‌‌‌‌‌‌లోని మూడు వికెట్లను తీసి విసిరేశాడు. ఈ రెండు వీడియోలు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో హల్‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో  బంగ్లా క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు షకీబ్​పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.