అది పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో లండి కోటల్ అనే టౌన్. లోకల్ పార్క్ ఒకదాంట్లో పెద్ద మర్రిచెట్టు ఉంటుంది. కానీ, అదేం చిత్రమో.. ఆ మర్రిచెట్టుకి సంకెళ్లు వేసి ఉంటాయి. ఆ చెట్టు మొదళ్లో ‘‘ఐయామ్ అండర్ అరెస్ట్. తప్పతాగిన ఒక బ్రిటీష్ ఆఫీసర్.. నేను అటు ఇటూ కదులుతున్నా అనే కోపంలో నాకీ శిక్ష వేశాడు”అని ఒక బోర్డు రాసి ఉంటుంది. ఈ బోర్డును 1947లో ఏర్పాటు చేశారు. కానీ, ఆ చెట్టుకి ఆ శిక్ష పడి వందేళ్లకు పైనే అవుతోంది. 1898లో బ్రిటీష్ కాలనీ ఆఫీసర్ జేమ్స్ స్క్విడ్ తాగిన మైకంలో ఆ చెట్టుకి ఈ విచిత్రమైన పనిష్మెంట్ వేశాడు. అప్పటి నుంచి ఆ చెట్టుకి ఆ సంకెళ్లు అలానే వేలాడుతున్నాయి. పాక్కి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆ సంకెళ్లను తొలగించలేదు అక్కడి అధికారులు. బ్రిటీష్ పాలనలో అణిచివేత ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి ఈ చెట్టును ఒక గుర్తుగా భావిస్తారు వాళ్లు. అయితే ఆ ప్రాంతం ఖాన్ షిన్వారీ అనే వ్యక్తిది. కానీ, ఆ చెట్టు ఉందన్న కోపంతో జేమ్స్ స్క్విడ్ దానిని బ్రిటీష్ పరం చేశాడు. ఇప్పుడు ఆ ఏరియా పాకిస్తాన్ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది. షిన్వారీ మనవడు ఇస్లాం ఖాన్ ఇప్పుడు ఆ జాగా కోసం న్యాయపోరాటం చేస్తున్నాడు.