సరస్వతీ పూజలో క్రికెటర్ షమీ కూతురు: ఇంటర్నెట్‌లో వైరల్

సరస్వతీ పూజలో క్రికెటర్ షమీ కూతురు: ఇంటర్నెట్‌లో వైరల్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహహ్మద్ షమీ కుమార్తె ఐరా ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇటీవల ఆ పాప సరస్వతీ పూజలో పాల్గొన్న ఫొటోను తండ్రి షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘లుకింగ్ సో స్వీట్ బేటా.. లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ బేటా. సీ యూ సూన్’ అని కాప్షన్ పెట్టాడు. జనవరి 30న ఈ ఫొటోను పోస్ట్ చేశాడు షమీ. ఈ ఫొటోకు నాలుగు రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది లైక్ కొట్టారు.

న్యూజిలాండ్‌పై 5-0 తేడాతో విజయం సాధించిన టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న సమయంలో సరస్వతి పూజలో పాల్గొన్న తన బిడ్డ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముద్దుగా చిన్న శారీ కట్టుకున్న తన చిట్టితల్లిని ఆశీర్వదిస్తూ తండ్రి షమీ క్యాప్షన్ పెట్టాడు. పాప క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు చాలా మంది ఆశీస్సులిచ్చారు. అయితే కొంత మంది ఫాలోయర్లు మాత్రం షమీని తప్పుబట్టారు. ఒక ముస్లింగా హిందూ పూజల్లో పాల్గొనకూడదంటూ కామెంట్ చేశారు. ఓ నెటిజన్ అయితే దయచేసి మీ పేరులో మహమ్మద్ అని తీసేయండి అంటూ కామెంట్ చేశాడు. కావాలంటే మత మార్పిడి చేసుకోవచ్చు కానీ, ఇస్లాంలో ఉంటూ ఇలా చేయడం హరామ్ అని సూచించాడు మరో వ్యక్తి. మరికొందరు షమీని మెచ్చుకుంటూ సపోర్ట్‌గా కామెంట్లు పెట్టారు. చిన్నారి ఐరాకి దీవెనలిచ్చారు. ‘షమీ.. మీరు, మీ కుమార్తె హిందు, ముస్లిం అని మతాలతో సంబంధం లేకుండా ఇండియన్స్ అని చాటారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.