ఎన్సీపీలో అజిత్‌కు దక్కని పదవి..? శరద్‌ పవార్‌ ఏమన్నారంటే..?

ఎన్సీపీలో అజిత్‌కు దక్కని పదవి..? శరద్‌ పవార్‌ ఏమన్నారంటే..?

ముంబయి : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీకి కొత్తగా ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె సుప్రియా సూలే, సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. అయితే.. పార్టీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్‌కు పార్టీ పదవి దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై శరద్‌ పవార్‌ స్పందించారు.అజిత్‌ ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

పార్టీ పదవులకు ఎంపిక చేయకపోవడంపై అజిత్‌ పవార్‌ నిరాశతో ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవాలని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. అజిత్‌ పవార్‌ ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని చెప్పారు. 

దేశవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలను చూసేందుకు ఎన్సీపీ నాయకత్వానికి తగినంత సహకారం ఉండేందుకే తన కుమార్తె సుప్రియా సూలే, సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 

బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంపైనే తన దృష్టి ఉంటుందని శరద్ పవార్ చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో జూన్ 23న పాట్నాలో నిర్వహించనున్న ప్రతిపక్షాల సమావేశం.. కొత్త దిశానిర్దేశం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేరన్నదానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 1976-77లోనూ ఎవరినీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తేనే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపే అవకాశం ఉంటుందన్నారు.