199వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

199వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

మంచిర్యాల జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 199వ రోజు కొనసాగుతోంది. లక్షెట్టిపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇటిక్యాల, అంకతిపల్లి, సూరారం, గుళ్లకోట, దోనబండ, హాజీపూర్, ధర్మారం వరకు సాగనుంది.  ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ జరిగే పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలు రాయిని అందుకోనుంది. 

గత సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించడం ఆనవాయితీగా జరిగేది. ముఖ్యమంత్రి కావడానికి పునాది వేసిన వైఎస్ పాదయాత్ర కూడా చేవెళ్ల నుంచే మొదలైంది. తండ్రి బాటలోనే వైఎస్ షర్మిల కూడా చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారు. 13 నెలల వ్యవధిలో 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ మైలు రాయిని చేరుకోనున్నారు.

షర్మిల ప్రతిరోజు తన పాదయాత్రలో పాదచారులు, ఎదురొచ్చిన వారిని కుశల ప్రశ్నలతో పలుకరిస్తూ.. ప్రేమగా వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలను అడిగి తెలుసుకుని తన వంతు పరిష్కారం చేస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. హామీలు అమలు చేయని టీఆర్ఎస్ ను నిలదీసే వారు లేకపోవడంతోనే తాను పార్టీ ప్రారంభించాల్సి వచ్చిందని... వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను  కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించడం లేదని ఎత్తి చూపుతున్నారు. సంక్షేమ పాలన కోరుకుంటే తనను ఆశీర్వదించాలని కోరుతూ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు.