మంత్రి నిరంజన్ రెడ్డికి షర్మిల సవాల్ 

మంత్రి నిరంజన్ రెడ్డికి షర్మిల సవాల్ 

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఏండ్లు గడుస్తున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఉన్న ప్రేమ..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై లేదని, అది చిన్న ప్రాజెక్టు కావడంతో కమీషన్లు తక్కువ వస్తాయనే పట్టించుకోవడం లేదన్నారు. అనుమతులు రాలేదని ప్రాజెక్ట్ పనులను అటకెక్కించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు రాకపోతే ఇప్పటి వరకు రూ.15వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం దీక్ష చేసి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో 80 శాతం ప్రాజెక్టుల కాంట్రాక్టులు మేఘా కృష్ణారెడ్డికే కట్టబెడుతున్నారని షర్మిల ఆరోపించారు. 

భారీగా అప్పులు చేసి ప్రజా సొమ్మును దోచుకుంటున్నా.. విపక్షాలు ప్రశ్నించడం లేదని షర్మిల అన్నారు. నోటిఫికేషన్లు రాక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ‘5, 6 తరగతులు చదవని వారు మంత్రులు కావాలి. డిగ్రీలు, పీజీలు చదివిన వారు మాత్రం హమాలీ పనులు చేసుకోవాలా’ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతూ వేల కోట్లు దండుకుంటున్నారని షర్మిల  ఆరోపించారు.