తులాభారంలో శశిథరూర్ తలకు గాయాలు

తులాభారంలో శశిథరూర్ తలకు గాయాలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ గాయపడ్డారు. సోమవారం ఉదయం ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో శశిథరూర్ తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కూడా. స్థానిక గాంధారి అమ్మవారి ఆలయానికి శశిథరూర్ తరచూ వెళ్తుంటారు. కేరళలో విషు పర్వదినం సందర్భంగా ఆయన ఆలయానికి వెళ్లారు. మనకు ఉగాది తరహాలో మలయాళీలు విషు పండుగను నిర్వహించుకుంటారు. పండగ సందర్భంగా అమ్మవారికి అరటి పండ్లతో తులాభారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తక్కెడలో ఓ వైపు అరటిపండ్లు ఉంచారు. మరోవైపు శశిథరూర్ కూర్చున్నారు. తక్కెడ పైకి లేచిన వెంటనే..త్రాసు ఒక్క సారిగా తెగిపడింది. దీంతో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను తిరువనంతపురం వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. థరూర్ తలకు ఆరు కుట్లు పడ్డాయని …ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా.. ఈ నెల 23వ తేదీన మూడో దశలో కేరళలో ఎన్నికలు జరగనున్నాయి.