సింగరేణి ఓసీపీ- 3లో షావల్ బోల్తా.. కార్మికుడికి తీవ్ర గాయాలు

సింగరేణి ఓసీపీ- 3లో షావల్ బోల్తా.. కార్మికుడికి తీవ్ర గాయాలు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ –2 డివిజన్​పరిధిలోని ఓపెన్​కాస్ట్​–3 ప్రాజెక్ట్​లో గురువారం సెకండ్​షిప్ట్​లో ప్రగతి షావల్​ మెషీన్ బోల్తా పడి ఆపరేటర్​తీవ్రంగా గాయపడ్డాడు. దసరా రోజు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు మేనేజ్​మెంట్​కొందరు కార్మికులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా బొగ్గును షావల్​మెషీన్ ద్వారా డంపర్లలోకి నింపుతుండగా.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మెషిన్ లోయలో పడిపోయింది.  దీంతో ఆపరేటర్​యెంజాల లక్ష్మినారాయణ తలకిందులుగా పడిపోగా, ఆయనకు తల లోపల, మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. 

వెంటనే గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి,  పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్​లోని ఒమెగా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం తలకు ఆపరేషన్​ చేయగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సింగరేణి ఆఫీసర్లు తెలిపారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో దారి కనిపించకపోవడం, షావల్​నడిచే దారి ఇరుకుగా ఉండడం, పని ప్రదేశంలో లైటింగ్​లేకపోవడం, బొగ్గును లోడ్ చేస్తుండగా ఆటోమెటిక్​గా మెషీన్ మూవ్ కావడంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 

ఆపరేటర్​మద్యం తాగి వెహికల్​నడిపాడని ఆఫీసర్లు తప్పుడు ప్రచారం చేశారని, ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఘటనకు మేనేజ్​మెంట్​ పూర్తి బాధ్యత వహించాలని ఏఐటీయూసీ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​జిగురు రవీందర్, సీఐటీయూ బ్రాంచ్​ సెక్రటరీ కుంట ప్రవీణ్​ కుమార్​ తెలిపారు.