అరిగోస పడుతున్నగొర్రెల కాపర్లు

అరిగోస పడుతున్నగొర్రెల కాపర్లు
  • అడవిలోకి పోనిస్తలేరు.. ఊర్లో ఉండనిస్తలేరు 
  • గుట్టలు,తుమ్మలు పోయినయ్​.. 
  • బీడు భూములు రియల్​ ఎస్టేట్​ అయినయ్​
  • జీవాలను ఎక్కడ మేపాలో తెలియక గొర్రెల కాపర్ల ఆవేదన 
  • సగం గొర్రెల యూనిట్లకే దాణా ఇచ్చిన పశుసంవర్ధక శాఖ 
  • నిబంధనలున్నా.. గడ్డి పెంచుకునేందుకు భూములియ్యని సర్కారు 

హైదరాబాద్​, వెలుగు : గొర్రెల కాపర్లు అరిగోస పడుతున్నరు. గొర్రెలను అటు అడవిలోకి పోనియ్యక.. ఇటు ఊరిలోనూ ఉండనియ్యకపోవడంతో వాటిని ఎక్కడ మేపాలో అర్థం కాక ఆవేదనకు గురవుతున్నరు. గుట్టలు, తుమ్మలు గాయబై.. బీడు భూములు రియల్​ ఎస్టేట్​వెంచర్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  జీవాలకు మేత దొరుకుత లేదు. కనీసం వాటిని మేపుకునే సౌలతులు కూడా లేకపోవడంతో గొర్రెల కాపర్లు అవస్థలు పడుతున్నరు.  అడవిలోకి గొర్రెలు వచ్చినయని ఫారెస్టు ఆఫీసర్లు.. హరితహారం మొక్కలు తిన్నయని గ్రామ పంచాయతీ అధికారులు వేధిస్తున్నరు. ‘‘రైతుల పండ్ల తోటల్లో గొర్రెలను మేపుకోవడానికి అవకాశమిస్తం”అని గొర్రెలు పంపిణీ చేసినప్పుడు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని గొర్రెల కాపరులు వాపోతున్నరు.  

గొర్రెల పంపిణీ సరే.. పట్టింపు ఏది ?

రాష్ట్ర సర్కారు ఓ వైపు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ గొల్ల కురుమలు సంపద సృష్టిస్తున్నరని చెప్పడం తప్పితే.. క్షేత్రస్థాయిలో వారి ఇబ్బందులను పట్టించుకుంటలేదు. దీంతో గొర్రెల కాపర్లు జీవాలను మేపుకోవడం పెద్ద సవాల్​ గా మారింది. ఊర్లలో రోడ్ల పక్కనున్న భూములు రియల్​ ఎస్టేట్​ వెంచర్లుగా మారడంతో  మేత కరువైంది. చెరువు గట్ల పొంటి తుమ్మలు లేక మేత దొరుకుతలేదు. వ్యవసాయం చిన్న కమతాలుగా విభజన కావడంతో.. భూమంతా సాగులోకి వచ్చింది. గ్రామాల్లో బీడు భూములు లేకుండా పోయాయి. గుట్టలు గ్రానైట్​ క్వారీలుగా మారడంతో వాటిలో జీవాలను మేపుకునేటట్టు లేదు.  పొలం గట్లకు పోతే రైతులు ఊకుంటలేరు. దీంతో సర్కారు గొర్రెలు ఇచ్చినా.. వాటిని మేపుకోవడానికి ఎంతో ఇబ్బంది ఎదురవుతోందని గొర్రెల కాపర్లు వాపోతున్నరు. 

దాణా సగం కూడా ఇయ్యలే..

గొర్రెల పంపిణీ సందర్భంగా ఒక్కో యూనిట్​కు రూ.3445 విలువైన 206 కిలోల దాణాను ఇవ్వాలనే నిబంధన పెట్టారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 3.92 లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. కానీ వీటిలో సగం యూనిట్లకే  పశుసంవర్ధకశాఖ అధికారులు దాణా బస్తాలు ఇచ్చి చేతులెత్తేశారు.  దీంతో మిగతా గొర్రెల యూనిట్లు పొందిన వారందరికీ 206 కిలోల దాణా అందని పరిస్థితి ఏర్పడింది.

గొర్ల మేత కోసం సర్కారు భూములిస్తలేరు.. 

559 జీవో ప్రకారం సాగుకు అనుకూలంగా లేని ప్రభుత్వ భూములను గొర్రెల మేత కోసం సొసైటీలకు ఇవ్వాలి.  ఉదాహరణకు 1999లో ఈ అవసరాల కోసం జనగామ జిల్లా గానుగు పహాడ్​ గ్రామంలో 119 ఎకరాల భూములను సర్కారు ఇచ్చింది. కానీ తెలంగాణ గవర్నమెంట్​ వచ్చినప్పటి నుంచి ఒక్క  ఎకరా కూడా ఇయ్యలేదని గొర్రెల కాపర్లు అంటున్నరు. కనీసం గ్రామానికి పదెకరాల భూమిని గొర్ల సొసైటీలకు ఇస్తే వాటిలో బోర్లు వేసుకుని గడ్డి పెంచుకుని గొర్రెలను కాపాడుకోవచ్చని కాపర్లు చెబుతున్నారు. 1016 జీవో ప్రకారం గొర్రెల కాపర్లకు తుమ్మచెట్ల మీద హక్కు కల్పించింది. కానీ మిషన్​ కాకతీయ అమలు చేసిన తరువాత చెరువుల్లో తుమ్మచెట్లు అన్ని తీసేసిన్రు. 

గొర్రెల కాపర్ల తిప్పలివి..

  • హనుమకొండ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలంలోని ఓ గ్రామంలో గొర్రెలు ఊర్లో నుంచి పోకుండా ఆంక్షలు పెట్టారు​. వాటి పెంటతో రోడ్లు కరాబు అవుతున్నాయని​.. వాటిని ఊర్లోకి రానీయొద్దని పంచాయతీలో తీర్మానం చేశారు. 
  • ఇటీవల జనగామ జిల్లాలో గొర్రెలను మేపుకుంటన్న ఓ కాపరి సెల్​ ఫోన్ ను ఫారెస్ట్ అధికారులు లాక్కున్నారు. రోడ్డు వెంట ఉన్న మొక్కలను గొర్రెలు తిన్నాయని ఆరోపించారు. రూ.7 వేలు ఫైన్ కట్టి సెల్ ఫోన్​ తీసుకెళ్లాలని తిప్పలు పెట్టారు. గొర్ల కాపర్ల సంఘాల నేతలు పోయి మాట్లాడితే  కానీ వదిలిపెట్టలేదు. 
  • మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో ఫారెస్ట్​లోకి గొర్రెలు మేపడానికి వెళ్లాడని ఓ గొర్రెల కాపరికి ఫారెస్ట్​ అధికారులు రూ.10వేలు ఫైన్​ వేశారు.  
  • సిద్దిపేట జిల్లాలోనూ ఇదే విధంగా ఓ గొర్రెల కాపరికి రూ.8వేలు ఫైన్​ వేసిన్రు.

గొర్రెల ఫామ్స్​ ఏర్పాటు చేయాలి

రూ.30 లక్షల సబ్సిడీతో గొర్రెల ఫామ్స్​ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పిం చాలి. మేత ఇబ్బంది తీరిపోతుంది. చోరీలు తగ్గుతాయి. గతంలో ఇచ్చిన గొర్రెలను అమ్ము కోవడానికి కారణంమేత లేక పోవడమే!!’’

- రవీందర్​, ప్రధాన కార్యదర్శి, గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం

గోడలు కట్టిన్రు.. జాలీలు పెట్టిన్రు

ప్రైవేటు భూములు వెంచర్లు అయినయ్​.. గవర్నమెంట్​ భూములకు గొర్లు పోకుండా గోడలు కట్టిన్రు.. జాలీలు పెట్టిన్రు.. వెంచర్లలో మేస్తే యాటను ఇయ్యాలే.. ఎక్కడ బీడు భూములున్నా ఎకరాకు 2వేలు పుల్లెర కట్టాలి..లేకపోతే గొర్రెలు గుంజుక పోతున్నరు.

- శ్రీశైలం, గూడూరు, రంగారెడ్డి జిల్లా

జీవాలకు మేత దొరుకుతలేదు..

‘‘ఊరు శివారు భూములన్నిట్ల పంటలేస్తున్నరు. బీడు భూములన్నీ ప్లాట్లు చేస్తున్నరు. గుట్టలు క్రషర్లు పెట్టి కంకర మిల్లులు అయినయ్​. అడవిలో  ఫారెస్టోల్లు మేపనిస్తలేరు. ఉన్న జీవాలను కాపాడుకోవడానికి చానా కష్టమైతాంది.’’

- ఎల్లయ్య, శనిగపురం, మహబూబాబాద్​జిల్లా