
దుండగుల చేతిలో హత్యకు గురైన జెడ్పీటీసీ శెట్టే మల్లేశం మృతదేహాన్ని స్వస్థలం సిద్దిపేట జిల్లా గుర్జకుంట గ్రామానికి తరలించారు. మల్లేశం హత్య నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడైన నంగి సత్యనారాయణ ఇంటిపై మల్లేశం బంధువులు దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలతో పాటు కారును ధ్వంసం చేశారు. వందలాది మంది తరలిరావడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
శెట్టే మల్లేశం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కడసారి చూపుల కోసం భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజారాధాకృష్ణ, ఇతర నేతలు పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
నిన్న ఉదయం ఉదయం మార్నింగ్ వాక్ తర్వాత ఇంటికి వెళ్తుండగా మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దాడి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మల్లేశాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట నుండి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అస్పుత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. హత్యకు పాల్పడిన నిందితులు లొంగిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.