
- ఓడలో ప్రమాదకర కెమికల్స్
- సముద్ర, తీరప్రాంత జీవజాలానికి పొంచివున్న ముప్పు
కొచ్చి: కేరళలోని కొచ్చి తీరం సమీపంలో లైబీరియాకు చెందిన ఒక భారీ కార్గో ఓడ ఆదివారం సముద్రంలో మునిగింది. ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కాపాడింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ, కేరళ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) కూడా పాల్గొన్నాయి. ఈ ఓడలో 640 కంటైనర్లు, 84.44 టన్నుల డీజిల్, 367.1 టన్నుల ఫర్నస్ ఆయిల్ ఉన్నాయి. వీటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. లైబీరియాకు చెందిన ఎంఎస్‌సీ ఎల్సా 3 అనే ఈ ఓడ కొచ్చి పోర్టుకు వస్తుండగా శనివారం రాత్రి 26 డిగ్రీలు వంగిపోయింది. దీంతో పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ఓడలోని సిబ్బంది ఐసీజీకి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ శనివారం అర్ధరాత్రి 21 మంది సిబ్బందిని కాపాడింది. మిగిలిన ముగ్గురిని ఆదివారం ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ సుజాత రక్షించింది. సిబ్బందిలో రష్యా, ఉక్రెయిన్, జార్జియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.
పర్యావరణ రక్షణకు చర్యలు
కేరళ సముద్ర తీరంలో అరుదైన పర్యావరణం ఉంది. ఇప్పటి వరకూ ఓడ నుంచి ఎలాంటి లీకేజీలు లేవు. క్రూడ్ ఆయిల్ లీక్ అయితే అక్కడి పర్యావరణానికి, సముద్ర తీర ప్రాంత జీవజాలానికి పెద్ద నష్టం వాటిల్లే ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో ఐసీజీ, ఇండియన్ నేవీ అప్రమత్తంగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ లీకేజీని గుర్తించే టెక్నాలజీ కలిగిన ప్లేన్స్‌తో నిరంతరం ఓడను పరిశీలిస్తున్నాయి. ఒకవేళ లీకేజీలు ఏర్పడితే, వాటిని నివారించేందుకు ఐసీజీకి చెందిన సక్షమ్ షిప్ రెడీగా ఉంచారు. మరోవైపు, కంటైనర్ల నుంచి చమురు లీక్ అయి తీరానికి చేరితే తాకవద్దని కేఎస్‌డీఎంఏ హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఇలాంటి పరిస్థితిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఐసీజీ, నేవీ సమన్వయంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటించింది.