రేపటినుంచి షిరిడీ నిరవధిక బంద్

రేపటినుంచి షిరిడీ నిరవధిక బంద్

బంద్‌ను సమర్థించిన 50 గ్రామాల సర్పంచులు

సాయి పుణ్యక్షేత్రం షిరిడీ రేపటినుంచి బంద్‌ కానుంది. పర్భణి జిల్లాలోని పాథ్రి అభివృద్ధికి మహారాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడమే ఈ బంద్‌కు దారితీసింది. పాథ్రి సాయిబాబా జన్మస్థలమని, అందుకే దాని అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. దాంతో సాయిబాబా జన్మస్థలంపై చర్చ మొదలైంది. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ.. షిరిడీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుంచి షిరిడీ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. సాయిబాబా జన్మస్థలంపై ఎలాంటి ఆధారాలు లేవని అక్కడి స్థానికులు అంటున్నారు. ఈ అంశంపై సీఎం ఉద్ధవ్ తన వైఖరిని స్పష్టం చేసే వరకు శాంతియుత నిరసనలు చేపడుతామని స్థానికులు అంటున్నారు.

భక్తుల విశ్వాసాల గురించి మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండేందుకే రేపటి నుంచి నిరసనలు చేపడుతున్నామని స్థానికులు అంటున్నారు. బంద్ సందర్భంగా ప్రైవేట్ వాహనాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూత పడనున్నాయి. కాగా.. సాయిబాబా ఆలయం, సాయి ప్రసాదాలయాలు, సాయి హాస్పిటల్, సాయి భక్తనివాస్, స్థానిక మెడికల్ షాపులను తెరిచే ఉంచనున్నట్లు సమాచారం. MHRTC బస్సులు మరియు స్థానిక హోటల్స్ కూడా తెరిచే ఉండనున్నాయి. ఈ బంద్ వల్ల విమానాలు, రైళ్ల ద్వారా వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే ఎయిర్ పోర్ట్ నుంచి షిరిడీ ఆలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే నాగర్ సోల్ రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిలో ఎక్కడినుంచైనా షిరిడీ చేరుకోవాలంటే ప్రైవేట్ వాహానాలే దిక్కు. బంద్ వల్ల వాహానాలు ఉండవు కాబట్టి ఇబ్బందులు తప్పవు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు షిరిడీకి వెళ్తుంటారు. వారందిరికి కూడా ఇబ్బందులు తప్పవు. షిరిడీ బంద్‌ను షిరిడీ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 50 మంది సర్పంచులు సమర్థించారు. ఇవాళ సాయంత్రం మరోసారి స్థానికులతో సమావేశం తర్వాత పూర్తిస్థాయి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు వాక్ చౌరే తెలిపారు. షిరిడీ వచ్చే సాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. సాయిబాబా జన్మస్థలంపై సీఎంకు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యులు తమ అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాథ్రి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్‌లు సమర్థించాయి. పాథ్రి సాయి ఆలయం అభివృద్ధిని వ్యతిరేకించవద్దని ఆ పార్టీలు అంటున్నాయి. సాయిబాబా జన్మస్థలం పాథ్రి అని, కర్మస్థలం షిరిడీ అని ఎన్సీపీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఖాన్ వ్యాఖ్యానించారు. పాథ్రి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. పాథ్రి అభివృద్ధికి 100 కోట్లు కాకపోతే 200 కోట్లు కేటాయించినా తమకు అభ్యంతరం లేదని పలువురు షిరిడీ వాసులు అంటున్నారు. అయితే అది సాయిబాబా జన్మస్థలం అని చెప్పి ఇవ్వడాన్ని వారు తప్పుబడుతున్నారు. సాయి తన జీవితకాలంలో తన మతం, ప్రాంతం గురించి ఎప్పుడూ చెప్పలేదన్నారు. రికార్డుల ప్రకారం 1854లో సాయి తన 16 ఏళ్ల వయసులో షిరిడీకి వచ్చారని, 1918లో అక్కడే సమాధి అయ్యారని పలువురు చెబుతున్నారు.

For More News..

రాజశేఖర్ ఆవేశపరుడు: హీరో సుమన్

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు