భారతీయ సంపన్నులు ఛారిటీ విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని పెద్దపెద్దోళ్లు ఇచ్చిన విరాళాలు 11 శాతం పెరిగి రూ.11వేల 554 కోట్లకు చేరుకున్నాయి. 'ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2026' ప్రకారం.. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చిన వారి సంఖ్య 192 మంది నుంచి 219కి పెరిగింది.
హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ వరుసగా 5వ ఏడాది కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. వీరు ఏడాది కాలంలో రూ.2వేల 593 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు రూ.7 కోట్ల 10 లక్షలు ఛారిటీ కోసం ఖర్చు చేశారు. ఇందులో 93 శాతం విరాళాలు ఆయన వ్యక్తిగత సంపద నుంచే కావడం గమనార్హం. ఇక గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ విరాళాలు 127 శాతం పెరిగి రూ.877 కోట్లకు చేరాయి. దీంతో ఆయన దేశంలో 2వ స్థానానికి చేరుకున్నారు.
దేశంలోని టాప్-10 ధనవంతుల్లో కేవలం నలుగురు మాత్రమే దాతృత్వం చేస్తున్న టాప్-10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. శివ్ నాడార్, గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ, పూనావాలా కుటుంబాలు ఈ రెండు జాబితాల్లోనూ ఉండగా.. మిగిలిన 6 స్థానాల్లో బజాజ్ ఫ్యామిలీ, నందన్ నీలేకని, కుమార్ మంగళం బిర్లా, సుధీర్-సమీర్ మెహతా, రంజన్ పాయ్, రోహిణి నీలేకని నిలిచారు.
మొత్తం విరాళాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాటా 53 శాతంగా ఉండగా.. వ్యక్తిగత విరాళాల వాటా 47 శాతంగా అంటే రూ.5వేల 413 కోట్లుగా ఉంది. టాప్-10 దాతల్లో శివ్ నాడార్, నందన్ నీలేకని, రంజన్ పాయ్ తమ సొంత నిధుల నుంచే అత్యధికంగా ఖర్చు చేశారు. అదానీ, బజాజ్, అంబానీ, బిర్లా కుటుంబాలు ప్రధానంగా తమ కంపెనీల సీఎస్ఆర్ నిధుల ద్వారా విరాళాలు అందించారు సమాజానికి.
ఈ ఏడాది జాబితాలో మహిళల సంఖ్య పెరిగింది. దాతల సంఖ్యలో మహిళలు 24 నుంచి 29కి చేరారు. రోహిణి నీలేకని రూ.215 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో ఉండగా, కిరణ్ మజుందార్ షా రూ.93 కోట్లు, అను ఆగా ఫ్యామిలీ రూ.78 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిణి నీలేకని తన విరాళాల్లో 100 శాతం పర్సనల్ వెల్త్ నుంచే ఛారిటీకి ఇచ్చారట.
దాతలు అత్యధికంగా విద్యా రంగానికి రూ.4వేల188 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగం 82 శాతం వృద్ధితో రూ.వెయ్యి 768 కోట్లు, పర్యావరణ విభాగం 86 శాతం వృద్ధితో రూ.813 కోట్లు అందుకున్నాయి. నగరాల పరంగా చూస్తే.. ముంబైలో అత్యధికంగా 64 మంది దాతలు ఉండగా, విరాళాల విలువ పరంగా రూ.3వేల 168 కోట్లతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.
కంపెనీల సీఎస్ఆర్ వ్యయం రూ.18వేల922 కోట్లుగా నమోదైనప్పటికీ.. ఖర్చు చేయని నిధులు రికార్డు స్థాయిలో రూ.2వేల 290 కోట్లకు చేరుకున్నాయి. గత దశాబ్ద కాలంలో సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇంతటి అంతరం ఎప్పుడూ లేదని హురున్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వం నిర్దేశించిన రూ.వెయ్యి032 కోట్ల కంటే ఎక్కువగా.. రూ.వెయ్యి223 కోట్లను సీఎస్ఆర్ కోసం ఖర్చు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న తరుణంలో ఎక్కువ మెుత్తంలో విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ అన్నారు.
