ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ లో చెట్టుకు చాటలు కడతారు

V6 Velugu Posted on Aug 26, 2021

వానజల్లు నేలని  తాకినా.. పంట చేతికొచ్చినా.. పూలు విరబూసినా.. అడవి తల్లి కాయగూరలిచ్చినా ఆదివాసులకి ఓ పెద్ద పండుగ. ఆ పండుగని కూడా చెట్టూ, పుట్టలతో మమేకమై జరుపుకుంటారు వీళ్లు.  పండుగలే కాదు ఆదివాసుల  లైఫ్​ స్టయిల్​కి, ఆచారాలకి కూడా ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుంది. అందుకే ఆదివాసులని, ప్రకృతినీ వేరు చేసి చూడలేం. ఈ శ్రావణ మాసంలోనూ ప్రకృతిని పూజిస్తూ ‘శివబోడి పండుగ’ జరుపుకుంటారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో  వారం రోజులుగా ఈ పండుగ  ఘనంగా జరుగుతోంది.  ఈ ‘శివబోడి’ పండుగ ప్రత్యేకత ఏంటంటే.. 

ప్రతి ఏటా శ్రావణమాసంలో  శివబోడి పండుగ జరుపుకుంటారు ఆదివాసులు. ఊరి పొలిమేరలో ఉన్న శివచెట్టుకి ఘనంగా పూజలు చేస్తారు.  ఆ శివ చెట్టుని ఊరికి రక్షగా  తమ తాతముత్తాలు నాటినట్టు చెప్తారు. అప్పట్నించీ ఆ చెట్టుని పూజించడం ఆచారంగా వస్తుందట. అయితే ఈ శివబోడి పండుగ పూజా విధానం చాలా కొత్తగా  ఉంటుంది. 

ఆనవాయితీగా వస్తోంది

శ్రావణమాసం మొదలవ్వగానే ఆదివాసులంతా ఊరి పెద్ద ఇంట్లో చేరతారు. శివబోడి పండుగ తేదీని నిర్ణయించి, పూజ కోసం చందాలు జమచేస్తారు. శివ బోడి పండుగ రోజు ప్రతి ఇంటి నుంచి పాత తడకగుల్లలు, చాటలు , వాటిల్లో  కొన్ని మిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం కుంకుమ, పసుపు పెట్టి గ్రామ పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకొస్తారు.  అక్కడ్నించి కుల పెద్దలు వాటిని ఊరి పొలిమేరలో ఉన్న శివ చెట్టు దగ్గరికి తరలిస్తారు. ఆ తడక గుల్లలు, చాటలకి ప్రత్యేక పూజలు చేసి శివచెట్టు కొమ్మలకి వేలాడదీస్తారు.శివబోడి పూజలో భాగంగా మేకను కూడా  బలిస్తారు. మటన్ కూరతో ఊరి పొలిమేరలో వన భోజనాలు పెడతారు. మేకకి బదులు కొందరు కోళ్లని కూడా బలిస్తారు.
 
భయపెట్టడానికి మేక తోలు..

చెడు గాలి గ్రామంలోకి  రాకుండా శివ చెట్టుని పూజిస్తామని  చెప్తారు ఆదివాసులు. ఆ చెట్టుని ఊరికి  రక్షణ కవచంగా చెప్తారు. దుష్ట శక్తుల్ని భయపెట్టడానికి బలిచ్చిన మేక తోలుని శివచెట్టుకి తలకిందులుగా వేలాడదీస్తారు. అందుకే ప్రతి ఆదివాసి గ్రామం పొలిమేరలో శివ చెట్టు కొమ్మలకు మేక తోలు వేలాడదీసి కనిపిస్తుంది. 

కోతలు షురూ

శివబోడి పండుగ టైంలో పెసలు, మినుములు, బొబ్బర్ల పంట చేతికొస్తుంది. కానీ ఈ పండుగ జరుపుకున్నాకే  పంట ఇంటికి తీసుకొస్తారు ఆదివాసులు.  కొత్త పంటతో  శివబోడికి నైవేధ్యాలు పెట్టాకే కోత కోస్తారు. ఈ కార్యాన్ని  ‘నోవోంగ్, పుంగర్ పోరి’ అని పిలుస్తారు.  నోవోంగ్, పుంగర్ పోరి చేయకుండా కోతకోసి  తింటే పంట పండదు.. తిండి అరగదని పెద్దల విశ్వాసం.

ఊరికి మంచి జరగాలని.. 

మా గ్రామ శివారులోని శివ చెట్టుకి ఏటా శ్రావణ మాసంలో పూజలు చేస్తాం.శివచెట్టు గట్టిగా ఉంటే ఊరు కూడా దిట్టంగా ఉంటుందని మా ముత్తాతల కాలం నుండి శివ బోడి జరుపుకుంటూ వస్తున్నాం. ఈ పండుగ రోజు ఊరంతా కలిసి వనభోజనాలు చెయ్యడం వల్ల ఊరి జనం మధ్య బంధాలు  బలపడతాయి. 
                                                                                                                     -పెందోర్ లచ్చు ,మార్లవాయి, జైనూర్

Tagged tribal festival , Shivabodi, Asifabad district

Latest Videos

Subscribe Now

More News