
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్‌ఎం లీడ్ రోల్స్‌లో నటించిన మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ ఎస్ తెరకెక్కించారు. బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. దీపావళి కానుకగా ఇవాళ గురువారం (అక్టోబర్ 16న) సినిమా విడుదలైంది.
మిత్ర మండలి మేకర్స్.. ‘టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్’ లతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతూ వచ్చారు. అంతేకాదు.. కోర్ట్ రిలీజ్ టైంలో ‘‘సినిమా నచ్చకపోతే, నా నెక్స్ట్ సినిమా చూడకండని’’ నాని చెప్పిన స్ట్రాంగ్ స్టేట్ మెంట్ అందరికీ తెలిసిందే. ఇపుడు ఇదే డైలాగ్ని ‘మిత్ర మండలి’ మూవీ నచ్చకపోతే.. నా నెక్ట్స్ సినిమాని చూడకండి’.. అని ప్రియదర్శి కూడా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చేశాడు.
ఈ క్రమంలోనే మూవీ రిలీజ్కు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. మరి నేడు థియేటర్లోకి వచ్చిన మిత్ర మండలి నవ్వులు పంచిందా? మేకర్స్ పెంచిన అంచనాలకు తగ్గట్టుగా కథ ఉందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
ఇదొక జంగ్లీపట్నానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ. వీరి గురించి ఊరి భాషలో చెప్పాలంటే .. పనిలేని పోరంబోకులు. బ్యాట్ అండ్ బాల్ లేకుండానే క్రికెట్ ఆడుతారు. బ్యాట్ లేకుండానే సిక్స్‌లు కొట్టడం, బాల్ లేకుండా వికెట్లు తీయడం వంటి స్కీన్లతో.. వీరి ఎంట్రీతోనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకు వారెవరో చెప్పలేదు కదా.. వారే ఈ నలుగురు ఉద్దండులు. చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్). ఈ కుర్రాళ్ల మధ్యలో కులపిచ్చి ఉన్న ఓ పొలిటిషన్ నారాయణ (వీటీవీ గణేశ్). చచ్చేటప్పుడు కూడా వేరే కులపొడి రక్తం కూడా ఎక్కించుకోడు. అలాంటి పట్టింపులతో జీవిస్తాడు. ఇతని కూతురు పేరు స్వేచ్ఛ (నిహారిక).
కులానికి ప్రాణమిచ్చే నారాయణ.. వారి తొట్టె కులం ఓట్లతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే నలుగురు పోరంబోకుల్లో.. ఇద్దరు సాత్విక్, అభి.. స్వేచ్ఛ (నిహారిక NM)ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోనే స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది. కానీ, సాత్విక్, అభితో కాదు. వేరే మూడో వ్యక్తితో. ఈ విషయం నారాయణకు తెలిసాక.. బయట జనాలకు తెలిస్తే పరువు పోతుందని భావిస్తాడు. ఈ క్రమంలో తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) ని రంగంలోకి దింపుతాడు.
ఇంతకీ.. నిహారిక ఎవరితో పారిపోయింది? కులం కోసం ప్రాణమిచ్చే నారాయణ, వేరేకులపొడితో వెళ్లిన కూతురిని ఏం చేశాడు? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురి కుర్రాళ్ల లైఫ్ ఎలా మారిపోయింది? తిరిగి నారాయణ తన కూతురిని తెచ్చుకున్నాడా? లేదా అనేది మూవీ మిగతా కథ.
ఎలా ఉందంటే:
‘జాతిరత్నాలు’ సినిమా విడుదలయ్యాక.. రైటర్స్ ఆలోచనలే మారిపోయాయి. కథతో పెద్ద పని లేకుండా, రెట్టింపు నవ్వులు పంచడమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు చేసేస్తున్నారు. అంతేకాదు..‘సినిమా రిలీజ్ అయ్యాక.. ఇందులో కథ లేదనే’ విషయాన్నీ ఆడియన్స్ ఎత్తి చూపుతారని.. ముందే మేకర్స్ స్వయంగా చెప్పేస్తున్నారు. అందుకే దర్శకుడు విజయేందర్, ముందే టైటిల్స్ కార్డ్స్‌లోనే క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కథ ఉండదని. ఈ క్రమంలోనే ‘మిత్ర మండలి’.. నవ్వులు పంచడమే టార్గెట్ గా వచ్చింది. అయితే, కొత్త అనుభూతిని అందించింది అని మాత్రం చెప్పలేం.
జాతి రత్నాలు, రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ సినిమాల్లో కథ లేకున్నా.. మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ ఉంటుంది. ఈ నేచురల్ కామెడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమాను వారి నవ్వులపై మోసి, సూపర్ హిట్ అయ్యేలా చేశారు. సందర్భోచితంగా నవ్వుకునే నవ్వులే సినిమాకి మెయిన్ అస్సెట్. ఈ విషయాన్ని మిత్రమండలి ఓ 60% న్యాయం చేసింది. ఇందులో ప్రియదర్శి, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, విటివి గణేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇలా చాలా మంది కమెడియన్స్.. తమ ప్రాసలతో నవ్వించినప్పటికీ.. ఎక్కడో చిన్న వెలితి కనిపిస్తుంది. అదే మిస్సయిన నేచురల్ కామెడీ!. సినిమా మొత్తం సెటైరికల్ కామెడీగా, స్పూఫ్గా తెరకెక్కించారు. అదే కొంత మైనస్గా నిలిచింది.
కథ పరంగా చూసుకుంటే.. లవ్ స్టోరీకి సామాజిక అంశాన్ని జతకట్టడం ఎప్పటిలాగే బలమైన అంశం. ఇందులో అది కొంతవరకు సక్సెస్ చేశారు డైరెక్టర్. ఎందుకంటే.. తన నవ్వించే ప్రయత్నంతోనే ఆడియన్స్ను ఆలోచింపజేశారు. సమాజంలో కుల పిచ్చితో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించాడు. కుల పిచ్చి ఉన్న రాజకీయ నాయకుడు నిక్కచ్చిగా ఆలోచించే విధానం, ఈ క్రమంలో కులం చూసి ఓట్లు వేసే ప్రజలు, ప్రేమ పెళ్ళిళ్ళను వద్దనే వాళ్ళు.. ఇలా చాలా మైండ్ సెట్స్ వాళ్ల మీద బాగా సెటైర్స్ వేశారు. ఈ సెటైర్స్ అన్ని, నవ్విస్తూనే ఆలోచింపచేస్తాయి. ఏదేమైనా ఈ దీపావళికి నవ్వుల టపాసులతో, ఆడియెన్స్ ఒకసారి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఎవరెలా నటించారంటే:
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా.. ఎప్పటిలాగే తమ స్పెషల్ కామెడీతో ముందుకొచ్చారు. అన్ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికి ఈ గ్యాంగ్ బానే కష్టపడ్డారు. అయితే, వీళ్ల కామెడీ టైమింగ్.. ‘మిత్ర మండలి’కి పెద్దగా ప్రభావం చూపలేదు. వీరి స్పూఫ్ కామెడీ అక్కడడక్కడా నవ్వించే ప్రయత్నం చేసిన, అది గట్టిగా పేలలేదని భావన ఆడియన్స్లో మిగిలిపోతుంది.
కమెడియన్స్ వెన్నెల కిషోర్, సత్యలు తలుచుకుంటే.. సినిమాని నిలబెట్టగలరు. కానీ, వారి పాత్ర ఇంకా బలంగా ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. అలాగే, విలక్షణ నటుడు వీటీవీ గణేశన్ పాత్రను సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ ఇస్తుంది. నిహారిక తన అందంతో ఆకట్టుకుంది. మిగతా నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు:
ఆర్.ఆర్.ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. సినిమా ప్రారంభంలో ‘కత్తి అందుకో జానకీ’ అనే సాంగ్ కొత్త ప్రయోగంలా అనిపిస్తుంది. సిద్ధార్థ్ ఎస్.జె. సినిమాటోగ్రఫీ, పీకే ఎడిటింగ్ పర్వాలేదు. కథకు తగ్గట్టుగా నిర్మాతల పెట్టిన ఖర్చు ఉన్నతంగా ఉంది. చివరగా.. డైరెక్టర్ విజయేందర్.. రైటింగ్ లో కామెడీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. నవ్వించాలనుకున్నా ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే, వీటితో పాటుగా కథపై కూడా ఫోకస్ పెట్టి ఉంటే ఇంకా లోతుగా ఉండేది.