యూట్యూబ్ లో చూసి రోబో తయారుచేసిండు

యూట్యూబ్ లో చూసి రోబో తయారుచేసిండు

అమ్మ ఇంటిపని చేస్తూ కష్టపడుతుంటే... చిన్న చిన్న పనులకు చేయందిస్తూ సాయం చేస్తు్ంటారు చాలామంది. కానీ, పదిహేడేండ్ల మహమ్మద్ షియాద్ చథోత్ మాత్రం అలా చేయలేదు. ఇంట్లో తన తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుందని, యూట్యూబ్ లో చూసి సొంతంగా రోబో తయారుచేశాడు.

కేరళలోని కన్నూర్ కి చెందిన షియాజ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. షియాజ్ తల్లి సరీనా ఉదయం భర్త, పిల్లలకు వండి పెట్టి, వాళ్లను తయారుచేసి ఆఫీస్, కాలేజీలకు పంపించేసరికి చాలా అలసిపోయేది. వయసు పెరుగుతుందటంతో అప్పుడప్పుడు అనారోగ్యానికి గురయ్యేది. అది చూసిన షియాజ్, తల్లికి సాయంగా ఉండే రోబో తయారుచేశాడు. దానికి ఆండ్రాయిడ్ పథూటి అని పేరు పెట్టాడు.

చిన్ననాటి నుంచే

షియాజ్ కి 14 ఏండ్లు ఉన్నప్పుడు రెస్టారెంట్ లో ఫుడ్ సర్వ్ చేస్తున్న  రోబో చూశాడు. అప్పుడే ‘నేను పెద్దయ్యాక నీ కోసం ఇలాంటి రోబో తయారుచేస్తా’ అని తల్లికి మాటిచ్చాడు. చిన్నప్పటినుంచే టెక్నాలజీ మీదున్న ఇంట్రెస్టే, పెద్దయ్యాక రోబో తయారుచేయడం సులభం అయింది. తనకు ఇదివరకు ఇంట్లో స్మార్ట్ బల్బులు, స్విచ్ లు చేసిన అనుభవం రోబో తయారీకి ఈజీ అయింది.

ఎంఐటీ సాయంతో

యూట్యూబ్ లో రోబోటిక్ టెక్నాలజీ నేర్చుకున్నాడు. తరువాత సెన్సర్లు తయాచేసి,  కావాల్సిన ఇక్విప్మెంట్, కెమెరా, మెటీరియల్ అంతా తెచ్చుకున్నాడు. ఒక అమ్మాయి బొమ్మని తీసుకొని దాన్ని స్టూల్ కి అమర్చాడు. సెన్సర్, కెమెరాలను ఆ బొమ్మకి ఫిక్స్ చేసి, రోబో అటు ఇటు తిరిగేలా స్టూల్ కి 12 వోల్ట్స్ గేర్ మోటార్, నాలుగు టైర్లని ఉపయోగించాడు. పథూటి రోబో రోబోట్ అల్ట్రాసోనిక్ సెన్సార్, వాయిస్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. ఫుడ్, నీళ్లని ఇంట్లో వాళ్లకి సర్వ్ చేస్తుంది.

పథూటి రోబోని కంట్రోల్ చేయడానికి మొబైల్ ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ని తయారుచేయడానికి ఎంఐటీ (మలబార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేరళ) వాళ్లు సాయం చేశారు.  మొత్తం ఆరు కిలోల వరకు బరువులు మోసే ఈ రోబో తయారుచేయడానికి కేవలం రూపాయలు 10,000 ఖర్చయ్యాయి. మామూలుగా అయితే, ఇలాంటి రోబోలకి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. పథూటి రోబో తయారుచేసినందుకు కేరళలో జరిగిన చాలా టెక్ ఈవెంట్‌లకు ఆహ్వానాలు అందుకున్నాడు షియాజ్. పథూటిపై పేటెంట్ తీసుకొని, మైక్రోకంట్రోలర్, మైక్రోప్రాసెసర్‌ టెక్నాలజీని వాడి హ్యూమనాయిడ్ రోబోని తయారుచేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదవాలనేది షియాజ్ కోరిక.