
పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ సచిన్ టెండూల్కర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని మెచ్చుకుంటూ..సచిన్ ను అవమానించే ప్రయత్నం చేశాడు. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ తెందూల్కర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని కొనియాడాడు. ఎన్నో వేల పరుగులు చేసినా..వంద సెంచరీలు సాధించిన సచిన్ ఆటగాడిగా తనకెంతో ఇష్టమన్నాడు. అయితే కెప్టెన్గా మాత్రం సచిన్ విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు. అందుకే సచిన్ తనంతట తానే కెప్టెన్సీని వదిలేశాడని అక్తర్ తెలిపాడు.
కోహ్లీ కూడా అంతే...
కెప్టెన్సీ విషయంలో కోహ్లీ, సచిన్ తేడా ఏమీ లేదని అక్తర్ అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీ ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడాడని తెలిపాడు. దీనికి టీ20 వరల్డ్ కప్ 2022యే ఉదాహరణ అని చెప్పాడు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్ ఆటపై ఫోకస్ పెట్టాడని..అందుకే సమయం తీసుకుని తిరిగి పుంజుకున్నాడని చెప్పాడు.
కోహ్లీని ఎందుకు పొగుడుతానంటే..?
కోహ్లీని ఎందుకు వెనకేసుకొస్తావు..అతన్ని ఎందుకు పొగుడుతావని ఎంతో మంది తనను అడుగుతారని..వారందరికి కోహ్లీ రికార్డులే సమాధానమని అక్తర్ తెలిపాడు. కోహ్లీ చేసిన సెంచరీల్లో 40 సెంచరీలు ఛేజింగ్‌లోనే వచ్చాయన్నాడు. ఈ తరంలో కోహ్లీ లాంటి బ్యాట్స్మన్ను చూపించగలరా అని ప్రశ్నించాడు.