బెంగళూరు: బెంగళూరులోని తమ్మెనహళ్లిలో దారుణం జరిగింది. ఫ్రెండ్ రూంకు తీసుకెళ్లి ఒక యువతిని యువకుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా బిక్కింవారిపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. బెంగళూరులోని ఒక ప్రముఖ కళాశాలలో దేవిశ్రీ అనే ఈ యువతి బీబీఎం చదువుతోంది. ఆమె బెంగళూరులోనే ఉంటూ బీబీఎం ఫైనల్ ఇయర్ చదువుతోంది.
ఆమెకు ప్రేమ్ వర్ధన్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఆదివారం ఉదయం ప్రేమ్ వర్ధన్ ఫ్రెండ్ రూంకు వెళ్లారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ తన ఫ్రెండ్ రూంలో దేవిశ్రీని ప్రేమ్ వర్ధన్ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రేమ్ వర్ధన్ కనిపించకుండాపోయాడు. సోమవారం ఉదయం తన రూంకు వెళ్లిన ప్రేమ్ వర్ధన్ ఫ్రెండ్ దేవిశ్రీ చనిపోయి కనిపించడంతో షాకయ్యాడు. పోలీసులకు సమాచారం అందించాడు.
ఆదివారం జరిగిన ఈ హత్య సోమవారం ఉదయం ఇలా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ వర్ధన్ కోసం పోలీసులు వెతుకులాట సాగిస్తున్నారు. దేవిశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్ మార్చురీ ముందు దేవిశ్రీ తల్లిదండ్రులు, సన్నిహితులు రోదించిన తీరు కలచివేసింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కూడా దేవిశ్రీ తన తండ్రితో కాల్లో మాట్లాడిందని.. ఆ తర్వాత నుంచి ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేసినా కలవలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
