
- రూ. 50 వేల అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధురాలి హత్య
- నిందితుడితో పాటు అతడి భార్య, మరో బాలుడు అరెస్ట్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ నెల 14న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. రూ. 50 వేల అప్పు ఎగ్గొట్టేందుకే ఓ వ్యక్తి మరో బాలుడితో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ బుధవారం సూర్యాపేటలో మీడియాకు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో అనసూర్యమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది.
అదే ప్రాంతానికి చెందిన లింగం సతీశ్ అనే వ్యక్తి ఏడాది కింద తన అవసరాల కోసం అనసూర్యమ్మ వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో అనసూర్యమ్మ సతీశ్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అప్పును ఎలాగైనా ఎగ్గొట్టాలని భావించిన సతీశ్ అనసూయమ్మను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 14న సతీశ్ మైనర్ అయిన తన మేనల్లుడితో కలిసి అనసూర్యమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడ అనసూర్యమ్మకు మద్యం తాగించగా.. ఆమె మత్తులోకి జారుకున్నాక గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తాను అప్పు తీసుకున్నప్పుడు రాసుకున్న పత్రంతో పాటు అనసూర్యమ్మ ఒంటి మీదున్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.
నగలను తన భార్య మౌనికకు చూపించగా.. ఆమె సలహా మేరకు విజయవాడ వెళ్లి బంగారాన్ని కరిగించి తన వద్దే ఉంచుకున్నాడు. అనసూర్యమ్మ చనిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా.. డెడ్‌బాడీపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరిపిన పోలీసులు అనసూర్యమ్మను సతీశ్ హత్య చేసినట్లు గుర్తించారు. సతీశ్, అతడి భార్య మౌనికతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి అప్పుపత్రం, రూ.3.60 లక్షల విలువైన బంగారం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, కానిస్టేబుల్ నాగరాజు, శంబయ్యను ఎస్పీ అభినందించారు.