
- అధిక వడ్డీ ఇస్తానని రూ. కోట్లలో మోసం
- వ్యాపారి ఇంటిపై బాధితుల దాడి
- నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఘటన
దేవరకొండ, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి పలువురి వద్ద రూ. కోట్లలో డబ్బులు తీసుకుని మోసగించిన వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. పీఏపల్లి మండలం వద్దిపట్ల పరిధి పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించాడు. దేవరకొండ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రూ. కోట్లలో డబ్బులు తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ వచ్చిన అతడు ఆ తర్వాత మోసగించాడు. దీంతో కొందరు బాధితులు రెండు నెలల కింద కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆదేశించారు. వడ్డీ వ్యాపారాన్ని వెంటనే మానుకోవాలని బాలాజీకి ఎస్పీ సూచించారు. అనంతరం బాలాజీ నాయక్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇటీవల అతను ఐపీ పెట్టాడు.
పలుగు తండాకు చెందిన రామావత్ హర్యానాయక్ మిర్యాలగూడలో స్థిరపడగా.. అధిక వడ్డీ ఆశతో అప్పులు తెచ్చి మరి బాలాజీ నాయక్ కు రూ.80 లక్షలు ఇచ్చాడు. పది రోజులుగా బాలాజీ నాయక్ కు ఫోన్ చేస్తుండగా లిఫ్ట్ చేయడంలేదు. దీంతో బాధితుడు హర్యానాయక్ సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ తగలబెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.