
నల్గొండ: చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర షాకింగ్ ఘటన జరిగింది. టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. అయితే.. లైసెన్స్ లేదో, స్కూటీకి డాక్యుమెంట్స్ లేవో.. తెలియదు. ఒక కుర్రాడు ట్రాఫిక్ పోలీసుల చెకింగ్స్ నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. టోల్ ప్లాజా కావడంతో వెనుకకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదు.
ఆ యువకుడు అమాంతం వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి స్కూటీని వేగంగా పోనిచ్చేశాడు. ఈ ఘటనలో.. వాహనాల చెకింగ్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గాల్లోకి ఎగిరిపడ్డాడు. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు బయటపెట్టారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న స్కూటీని ఆపే ప్రయత్నం చేసిన క్రమంలో స్కూటీ ఆపకుండా వెళ్లడంతో కానిస్టేబుల్ ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని తోటి పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.
కానిస్టేబుల్ను విచక్షణారహితంగా ఢీ కొట్టి స్కూటీ ఆపకుండా వెళ్లిన ఆ యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. స్కూటీ నంబర్ ఆధారంగా ఆ యువకుడిని కనిపెట్టేందుకు సీసీ ఫుటేజ్ను చెక్ చేశారు. పంతంగి టోల్ ప్లాజా చుట్టుపక్కల గ్రామానికి చెందిన కుర్రాడే అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.