షాద్ నగర్ లో భార్యను చంపి  బైక్ పై మూటకట్టుకొని..

షాద్ నగర్  లో  భార్యను చంపి  బైక్ పై  మూటకట్టుకొని..
  •  షాద్​నగర్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  •     రెండో భర్తే నిందితుడు
  •     పక్కా ప్లాన్ ప్రకారం హత్య 

షాద్ నగర్, వెలుగు: భార్యను అత్యంత కిరాతకంగా చంపి, డెడ్​బాడీతోపాటు కన్న కూతురిని పొలాల్లో పారేసిన ఘటనలో నిందితుడిని షాద్‌‌నగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించారు. మహబూబ్​నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన పానుగంటి నర్సింహులు, శోభ అలియాస్ శోభారాణి (33) నాలుగేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేండ్ల కుమార్తె ఉండగా, శోభకు అంతకుముందే వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. నర్సింహులు మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి.

దీంతో శోభ తన బిడ్డలతో కలిసి రంగారెడ్డిగూడెంలోని తల్లి వద్దకు వెళ్లింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నర్సింహులు ఎలాగైనా ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. ఈనెల 21న నీ కొడుక్కి సైకిల్ ఇప్పిస్తా మహబూబ్​నగర్​ రమ్మని పిలిచాడు. అతడి మాటలు నమ్మిన ఆమె తన కుమార్తెతో కలిసి  ​వెళ్లింది. నర్సింహులు వారిని తన గదికి తీసుకెళ్లి మద్యం తాగడంతో మళ్లీ దంపతుల మధ్య గొడవ మొదలైంది.

నర్సింహులు గ్రానైట్ రాయితో భార్య తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అర్ధరాత్రి శోభ మృతదేహాన్ని మూటకట్టి, బైక్​పై పెట్టుకొని.. దానిపైనే మూడేళ్ల కుమార్తెను కూర్చోబెట్టుకున్నాడు. రంగారెడ్డిగూడెం శివారులోకి తీసుకెళ్లి మృతదేహంతోపాటు చిన్నారిని పడేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని సోమవారం లింగంపల్లిలో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి వద్ద నుంచి సెల్ ఫోన్, హత్యకు వాడిన రాయి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నర్సింహులును అరెస్ట్​చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.