ఢిల్లీ హిట్​ అండ్​ రన్​ కేసు..ప్రమాదం జరిగిందని తెల్వలే

ఢిల్లీ  హిట్​ అండ్​ రన్​ కేసు..ప్రమాదం జరిగిందని తెల్వలే

న్యూఢిల్లీ: స్కూటీని ఢీకొట్టి యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. స్కూటీని ఢీకొట్టిన విషయం కానీ, కారు కింద యువతి చిక్కుకుపోయిన విషయం కానీ గుర్తించలేదని నిందితులు చెప్పినట్టు ఔటర్​ ఢిల్లీ డీసీపీ హరీంద్ర కే సింగ్​ వెల్లడించారు. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటం.. పెద్ద సౌండ్​తో మ్యూజిక్​ సిస్టం ఆన్​ చేసి ఉండటంతో తమకు బయటి శబ్దాలు వినిపించలేదని తెలిపారన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బానెట్​ కింద ఏదో తగులుతున్నట్టుగా గుర్తించి చెక్​ చేస్తే యువతి డెడ్​ బాడీ కనిపించిందని, దానిని తొలగించి పరారయ్యామని చెప్పారన్నారు. నిందితుల బ్లడ్​ శాంపిల్స్​ ను పోలీసులు సేకరించారు. వారు లిక్కర్​ తాగారా? లేదా? అనేది మెడికల్​ రిపోర్టులో వెల్లడికానుంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు పోలీసు కస్టడీ విధించింది. 

రేప్​ జరగలేదంటున్న పోలీసులు

యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం కిలోమీటర్ల దూరం డెడ్​ బాడీని ఈడ్చుకు వెళ్లడంతో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయని, దుస్తులు మొత్తం చిరిగిపోయాయని అంటున్నారు. పోస్ట్​ మార్టంలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. వెహికల్స్  కూడా ఫోరెన్సిక్​ ఎగ్జామినేషన్​కు పంపించినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ జనం ఆందోళనలు చేపట్టారు. 

సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన: ఎల్జీ సక్సేనా

యువతిని కారుతో గుద్ది కిలోమీటర్ల దూరం ఈడ్చుకుపోయిన ఘటన తనను షాక్​కు గురిచేసిందని ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. ఇది చాలా దారుణం అని, సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని అన్నారు. ఈ కేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరారు.