అమెరికాలో చైనా న్యూఇయర్​ వేడుకల పార్టీలో కాల్పులు

అమెరికాలో చైనా న్యూఇయర్​ వేడుకల  పార్టీలో కాల్పులు
  • మరో పదిమందికి తీవ్ర గాయాలు
  • లాస్​ఏంజెల్స్ లోని క్లబ్​కు వేలాదిగా వచ్చిన చైనా సంతతి ప్రజలు
  • కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయిన దుండగుడు

లాస్​ ఏంజిలెస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్​ ఏంజిలెస్​ పరిధిలో ఆసియావాసులు ఎక్కువగా ఉండే మాంటెరీ పార్క్​ ఏరియాలో ఒక సాయుధుడు ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపాడు.​ ఈ ఫైరింగ్​లో 10 మంది చనిపోగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. అమెరికా టైం ప్రకారం శనివారం రాత్రి 10.30 గంటలకు డ్యాన్స్​ క్లబ్​లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చైనీస్​ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఈ క్లబ్​కు వేలాదిగా ప్రజలు వచ్చారు. పార్టీ ముగించుకొని వారంతా వెళ్లిపోయిన గంట తర్వాత.. మెషీన్ గన్ చేతపట్టిన ఓ వ్యక్తి క్లబ్​కు వచ్చి అక్కడున్న వాళ్లపై ఫైరింగ్​ చేశాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వివరాలను లాస్​ ఏంజిలెస్​ కౌంటీ పోలీసుశాఖ కూడా ధ్రువీకరించింది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించింది.  ఇక డ్యాన్స్​ క్లబ్​ దగ్గర్లో రెస్టారెంట్​ను నిర్వహించే సీయుంగ్​ వాన్​ చాయ్.. కాల్పులకు ముందు జరిగిన సంఘటనలను పోలీసులకు వివరించాడు.  “గన్ పట్టుకున్న వ్యక్తి డ్యాన్స్​క్లబ్​వైపు  వెళ్తుండగా చూసిన ముగ్గురు వ్యక్తులు పరుగులు పెడుతూ వచ్చి నా రెస్టారెంట్లో దాక్కున్నారు. డోర్​ లాక్​ వేయాలని రిక్వెస్ట్​ చేశారు. ఎవరో ఒకతను గన్​ లోడ్​ చేసుకొని డ్యాన్స్​ క్లబ్​ వైపు వెళ్తుంటే చూసి వచ్చామని వాళ్లు నాకు చెప్పారు” అని తెలిపాడు. 

అల్​ హంబ్రాలో కాల్పులు..  అతడి పనేనా ?

ఇక మాంటెరీ పార్క్​ ఏరియాలో కాల్పులు జరిగిన కాసేపటికే.. దగ్గరే ఉండే అల్​ హంబ్రా ప్రాంతంలోనూ ఒక కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అల్​ హంబ్రా ఏరియాలోని లాయ్​ లాయ్​ బాల్​రూం, ఒక డ్యాన్స్​ క్లబ్​లలో ఈ కాల్పులు జరిగాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మాంటెరీ పార్క్ వద్ద కాల్పులు జరిపిన వ్యక్తే.. ఇక్కడ కూడా కాల్పులు జరిపి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అల్​ హంబ్రా ఏరియాలో కాల్పులు జరిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని, అతడి గన్​ను స్వాధీనం చేసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అధికారిక ప్రకటన వస్తేనే.. దీనిపై స్పష్టత వస్తుంది. అయితే అల్​ హంబ్రా ఏరియా కాల్పుల ఘటనలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా, అమెరికాలో కాల్పుల ఘటనల్లో కిందటేడాది 44 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

దొంగల ముఠా కాల్పులతో భారత సంతతి వ్యక్తి మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో దొంగల ముఠా జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన పాత్రో సిబోరాం(66) అనే వ్యక్తి చనిపోయాడు. ఎగ్జాన్​ గ్యాస్​ స్టేషన్​లోని మినీ మార్ట్​లో ఈ ఘటన చోటుచేసుకుం ది. చోరీకి చేసేందుకు వచ్చిన ముగ్గురు దొంగలు.. తుపాకులు చూపించి బెదిరిస్తూ  నేరుగా స్టోర్​లోని క్యాష్​ కౌంటర్లోకి చొరబడ్డారు. అందులో క్లర్క్​ గా  పనిచేసే పాత్రో సిబోరాంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం స్టోర్​ లో ఉన్న క్యాష్​ రిజిస్టర్​ ను తీసుకొని పారిపోయారు. పాత్రో సిబోరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. గన్​ కల్చర్​ వల్ల ఫిలడెల్ఫియాలో నేరాలు పెరుగుతున్నాయని పాత్రో సిబోరాం చాలాసార్లు తమతో చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడని అతడి సహోద్యోగులు మీడియాకు చెప్పారు.  ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.