కథ : సారీ.. నాయనమ్మా!

కథ : సారీ.. నాయనమ్మా!

వెంకన్న, రమణల కొడుకు కిట్టు. ఇద్దరూ పొద్దున్నే కూలి పనులకు వెళ్లి, ఏ రాత్రికో ఇంటికొచ్చేవాళ్లు. కిట్టు ఆలనాపాలనా నాయనమ్మ అంతమ్మ చూసుకునేది. మొదటిరోజు కిట్టూ స్కూల్​కి వెళ్ళనని మారాం చేస్తే వాళ్ల నాయనమ్మ చాక్లెట్లు కొనిచ్చింది. కిట్టూతో పాటే వెళ్లి, స్కూల్​ వదిలే వరకు అక్కడే కూర్చునేది. అలా స్కూల్​కి వెళ్లిన కిట్టూ ఇప్పుడు ఐదో తరగతికి వచ్చాడు. ఎప్పుడూ నాయనమ్మతోనే  ఉంటూ.. ఆమె చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాడు. కాలం గడుస్తోంది. కిట్టూ ఏడో తరగతికి వచ్చాడు. కిట్టూ వెనకాలే నాయనమ్మ చేతిలో కర్ర పట్టుకొని నడుస్తూ స్కూల్​కెళ్ళేది. ‘‘ఎందుకే నాయనమ్మా.. నా వెనకాలే వస్తావు? నా ఫ్రెండ్స్​ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లాడివా!’ అంటున్నారు. నేనొక్కడినే వెళ్తా స్కూల్​కి.. నువ్వు నాతో రావద్దు ’’ అన్నాడు. అయినా అవేమీ పట్టించుకోని నాయనమ్మ చిన్నగా నడుస్తూ కిట్టూ వెనకాలే వెళ్లేది.ఎంత చెప్పినా నాయనమ్మ వెనకాలే వస్తుంటే కిట్టూకి నాయనమ్మ మీద కోపం పెరిగింది. నాయనమ్మను చూస్తేనే కోపం తెచ్చుకునేవాడు. ఆమెతో మాట్లాడటం కూడా మానేశాడు. అయినా మనవడిపై ప్రేమతో కిట్టూకి తెలియకుండా తన వెంట స్కూల్​కి వెళ్తూనే ఉండేది. అది గమనించిన కిట్టూ కోపంతో ‘‘నన్ను చూసి నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. ఇంకోసారి నా వెనకాల వచ్చావంటే ఊరుకోను’’ అని కోపంగా క్లాస్​లోకి వెళ్లాడు కిట్టూ.

‘నాయనమ్మా.. నాయనమ్మా..’ అంటూ ముద్దుగా పిలిచే మనవడి ప్రవర్తన మారిపోయింది. అది చూసి నాయనమ్మకు కన్నీళ్లు ఆగలేదు. ఇంటి దగ్గరే ఉందామంటే ‘నా కిట్టూ ఏమవుతాడో!’ అని స్కూల్​ గోడకు ఆనుకొని జారుతున్న కన్నీటిని ముతక కొంగుతో తుడుచుకుంటూ కూర్చుంది. అటుగా వెళ్తున్న బొర్రమ్మ అంతమ్మను చూసింది. అంతమ్మ దగ్గరకొచ్చి ‘‘ఏందే అంతమ్మ ఎందుకేడుస్తున్నవ్ ?’’ అని అడిగింది. ఆ మాటలతో అంతమ్మ దుఃఖం రెట్టింపైంది. ‘‘ఏం లేదు! నా కొడుకూ, కోడలు కష్టాలు తలచుకొని ..’’ అని అంటుండగానే.. ‘‘ఎందుకే అబద్ధాలు చెప్తవ్​. వారం రోజుల నుండి చూస్తూనే ఉన్న ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నవ్​. కిట్టుగాడు ఏమన్న అన్నడా?’’ అని అడిగింది. ‘‘వాడు చిన్న పోరడే! బడికి ఒక్కడ్నే పోతా అంటున్నడు. దారి వెంట కుక్కలు ఉంటయ్. అప్పుడప్పుడు పాములు, తేళ్లు కూడా కనిపిస్తుంటయ్​. అసలే వాడికి భయం ఎక్కువ. అట్లాంటిది వాడొక్కడే ఎట్ల వెళ్తడు? అయినా నేనొక్కదాన్నే ఇంట్లో ఉండి ఏం చేస్తా..’’ అంటుంటేనే అంతమ్మ కన్నీటిని తుడుస్తూ ‘‘వానికే తెలుస్తదిలే...’’ అని సముదాయించింది బొర్రమ్మ.

అదే రోజు తెలుగు టీచర్ ‘‘పిల్లలూ...! ఈ రోజు మనం నాయనమ్మ పాఠం చెప్పుకుందాం. వృద్ధులు దైవంతో సమానం. వాళ్లని ఎప్పుడూ గౌరవించాలి. వాళ్లకి కావలసిన పనులు చేసి పెట్టాలి. అమ్మానాన్నలు ఇంటి వద్ద వదిలేసి పనులకు వెళ్తే మీకు స్నానం చేయించి, అన్నం తినిపించి, ఆడించేవాళ్లు. మన బాగోగులను చూస్తారు. వాళ్ల పిల్లలకే కాకుండా, మనవళ్లు. మనవరాళ్ల కోసం కూడా కష్టపడతారు. వాళ్లే లేకుంటే మనం లేం కదా! ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేకపోతే మా నాయనమ్మే చూసుకుంది. తన వల్లే నేను మీ ముందు నిల్చుని పాఠాలు చెప్తున్నా. ఏ స్వార్థంలేని దైవ స్వరూపులు వాళ్లు. అందుకే ప్రతి ఒక్కరూ వృద్ధుల్ని గౌరవించాలి’’ అని టీచర్​ చెప్తుంటే.. కిట్టూకు ఉదయం నాయనమ్మను అన్న మాటలు గుర్తొచ్చి, ఏడుపొచ్చింది. ‘చాలా పెద్ద తప్పు చేశా’ అని బాధపడ్డాడు. మిగతా పిల్లలు కిట్టూను అన్న మాటలు గుర్తొచ్చి తలదించుకున్నారు. ఇంటి గంట మోగగానే పరిగెత్తుకుంటు వెళ్లి పాఠశాల గోడ పక్కనే దీనంగా కూర్చున్న నాయనమ్మను దగ్గరగా చుట్టుకొని ‘‘సారీ నాయనమ్మా..’’ అని ఏడ్చాడు కిట్టూ. ‘ఊరుకో నా బంగారు కొండ’ అంటూ కిట్టూని ఓదార్చింది నాయనమ్మ. ఆ రాత్రి కిట్టూ నాయనమ్మ దగ్గరే కథలు వింటూ నిద్రపోయాడు. మరుసటి రోజు నాయనమ్మతో కలిసి బడికి వెళ్లాడు.  - ముక్కామల జానకీరామ్