బిల్డింగులు సరే.. రిక్రూట్ మెంట్​ ఏది?

బిల్డింగులు సరే.. రిక్రూట్ మెంట్​ ఏది?
  • హాస్పిటల్​ బిల్డింగ్స్ కు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా పర్మిషన్లు
  • డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నియామకంపై సర్కార్ ​మీనమేషాలు
  • అప్పులు తెచ్చి మరీ సివిల్ వర్క్స్‌‌‌‌‌‌‌‌
  • ప్రయోజనం‌‌‌‌‌‌‌‌ ఏంటని ప్రశ్నిస్తున్న డాక్టర్లు
  • కమీషన్ల కోసమేనని ప్రతిపక్షాల విమర్శలు

హైదరాబాద్, వెలుగు: హాస్పిటల్ బిల్డింగుల నిర్మాణానికి స్పీడ్​గా పర్మిషన్లు ఇస్తున్న రాష్ట్ర సర్కార్.. అందులో పనిచేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను నియమించే విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. బిల్డింగులు కట్టుడు మంచి విషయమే అయినప్పటికీ, రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయకుండా పేషెంట్లకు సేవలు ఎలా అందుతాయని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్(టిమ్స్‌‌‌‌‌‌‌‌లు), హనుమకొండలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఐదంతస్తుల కొత్త బిల్డింగ్, 46 పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు, 1,200లకు పైగా సబ్ సెంటర్లకు కొత్త బిల్డింగులు, నిమ్స్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో 2 కొత్త బిల్డింగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇవిగాక, ఇంకా హాస్పిటళ్లలో రిపేర్లు, తదితర సివిల్ పనులకు ఓకే చెప్పింది. ఈ పనులన్నింటికీ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద నుంచి సుమారు రూ.1,100 కోట్లు అప్పు తీసుకుని హనుమకొండలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కట్టే 3 స్పెషాలిటీ హాస్పిటళ్ల కోసం రూ.2,600 కోట్లు, నిమ్స్ విస్తరణకు రూ.1,550 కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పులు తెచ్చి మరీ బిల్డింగుల నిర్మాణానికి ఓకే చెబుతున్న ప్రభుత్వం.. డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను నియమించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. కమీషన్ల కోసమే సివిల్ వర్కులు ఎక్కువగా చేపిస్తున్నారని, కమీషన్లు రావు కాబట్టే నియామకాల జోలికి వెళ్లడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నయి.

సగానికిపైగా ఖాళీలు

పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల నుంచి మెడికల్ కాలేజీల వరకూ ప్రతి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోనూ సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో 12,735 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపితే, అందులో ఒక్క పోస్టును కూడా ఇప్పటివరకూ భర్తీ చేయలేదు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా, ఇప్పటికీ భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. మెడికల్ కాలేజీల్లో 1,183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 357 ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఇలా వెకంట్ ఉండగానే, మరోవైపు ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,100 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో కలిపి సుమారు 4 వేల నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒక్క పోస్టుకు కూడా కనీసం ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ పాత హాస్పిటళ్లలోని పోస్టులే. కొత్త హాస్పిటళ్లకు పోస్టులు మంజూరు చేస్తే ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుంది. కానీ, అలా చేయకుండా ఉన్న కొద్ది మందినే కొత్త, పాత దవాఖాన్లలో అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల పనిభారం ఎక్కువై, వైద్య సేవలపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటున్నారు. దీని వల్ల సర్కార్ సొమ్ము అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు దక్కుతోంది. నిరుద్యోగులు అరకొర జీతాలకు పనిచేయాల్సి వస్తోంది.