రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కావలెను!.. 11సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్కరూ రాలే

రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కావలెను!.. 11సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్కరూ రాలే
  • రిపేర్లకూ, కొత్త రోడ్ల పనులు చేయక తిప్పలు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కరువయ్యారు. జిల్లాలో ఉన్న ప్రధాన రోడ్లు వేసేందుకు ఆర్అండ్ బీ శాఖ ఇప్పటి వరకు 11 సార్లు నోటిఫికేషన్ వేసినా ఒక్కరూ టెండర్లు దాఖలు చేయడానికి ముందుకురాలేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. పేపర్ నోటిఫికేషన్ల కోసం రూ. కోటికి పైగా ఖర్చు చేసినా ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్లు వేయడానికి రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో రోడ్లకు రిపేర్లు, కొత్త రోడ్లకు మోక్షం కలగక రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. అంతర్రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంత రోడ్లు అధ్వానంగా మారి మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. డ్యాం రోడ్, నేషనల్ హైవే సర్వీస్​ రోడ్లలో ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది.

టెండర్లు వేస్తలేరు..

ఎన్ హెచ్–7 నుంచి వెంకటాపురం రోడ్డుకు రూ.3.30 కోట్లు, ఎన్ హెచ్ 7 నుంచి పాగటూరు రోడ్డుకురూ.3.32 కోట్లు, ఐజ నుంచి రాజాపూర్ రూ.2.60 కోట్లు, మానవపాడు నుంచి చెన్నిపాడు రూ.2.22 కోట్లు, ఐజ రోడ్డుకు రూ.1.60 కోట్లు, మిట్టదొడ్డి నుంచి బలిగెర రోడ్డుకు రూ.1.33 కోట్లు, గద్వాల నుంచి రాయచూరు రోడ్డుకు రూ. 2.72 కోట్లు, దరువు నుంచి కర్నాటక బార్డర్ రెన్యువల్ రోడ్డుకు రూ.1.02 కోట్లు, కొండపల్లి రోడ్డుకు1.80 కోట్లు, గద్వాల నుంచి రాయచూర్ రోడ్డు (2వ బిట్టు) రూ.2.22కోట్లు, పంచాయతీరాజ్ రోడ్డు నుంచి రేపల్లె రోడ్డు రూ.కోటి, గంజి రోడ్ నుంచి రాయచూర్ రోడ్డు వరకు రూ.1.29 కోట్లు, అలంపూర్ నుంచి మారమునగాల రూ.2.50 కోట్లు, నేషనల్ హైవే నుంచి వెంకటాపూర్ రోడ్డుకు రూ.3.21 కోట్లు, ఎరిగెర నుంచి ఐజ, అలంపూర్ రోడ్డుకు రూ.3.34 కోట్లు.

హైవే నుంచి కలుకుంట్ల రోడ్డుకు రూ. 95 లక్షలతో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకొని పనులు స్టార్ట్ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. రాజీవ్ మార్గ్ రోడ్​ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు రూ.83 లక్షల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.93 లక్షలతో చేపట్టిన కృష్ణా రోడ్డు పనులు మధ్యలోనే ఆపేశారు. పనులు మధ్యలో ఆపేయడంతో కంకర తేలి ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చింతరేవుల నుంచి జూరాల డ్యామ్ వరకు రోడ్ల మెయింటెనెన్స్ పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి.

కమీషన్లకు భయపడే..

టెండర్లలో పనులు దక్కించుకొని పనులు చేశాక వాటికి డబ్బులు రిలీజ్​ చేసేందుకు కూడా పై లెవెల్ లో ఆఫీసర్లు, రాజకీయ నాయకులకు 5 శాతం కమీషన్లు ఇవ్వాలనే టాక్ కాంట్రాక్టర్లలో నడుస్తోంది. 5 శాతం డబ్బులు కట్టకపోతే ఆ పనికి సంబంధించి డబ్బులు రావని తెగేసి చెబుతున్నారు. బిల్లులు, రికార్డు చేసిన ఆఫీసర్లకు 10 నుంచి 12 శాతం కమీషన్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఇలా 20 శాతం వరకు డబ్బులు పోతే తాము నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. దీంతో పనులు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారనే వాదనలున్నాయి.

టెండర్లు వేయడం లేదు..

రోడ్లు పనులకు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని మాట వాస్తవమే. పనులు చేసిన వెంటనే బిల్లులు చేస్తున్నాం. ఫండ్స్​ రిలీజ్ విషయం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫీసర్లకు కూడా చెప్పాం.

ప్రగతి, ఈఈ, ఆర్అండ్ బీ