
- మొత్తం కాలేజీలు 50.. విద్యార్థుల సంఖ్య 15,948 మంది
- పీడీలు లేక ఆటలకు దూరమవుతున్న ఇంటర్ విద్యార్థులు
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆటలు ఆడించేవారే కరవయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 50 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. ఒక్క కాలేజీకి మాత్రమే పీడీ ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 15,948 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో అండర్–19 పోటీలకు చాలామంది విద్యార్థులు దూరమవుతున్నారు.
జూనియర్ కాలేజీల్లో క్రీడల జాడేది
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు క్రీడలకు ప్రాధాన్యం దక్కడం లేదు. జిల్లాకేంద్రాలు, పట్టణాల్లోని కాలేజీల కంటే మండల కేంద్రాల్లోని కాలేజీల్లో చదివే విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి ఎక్కువగా కన్పిస్తుంది. స్కూల్ విద్యార్థులకు ఏడాదికోసారి ఎస్‌జీఎఫ్ క్రీడలు నిర్వహిస్తుండగా.. జూనియర్ కాలేజీల్లో మాత్రం ఎలాంటి యాక్టివిటీస్ కన్పించడంలేదు. దీంతో ఇంటర్ విద్యార్థుల్లో క్రీడా సామర్థ్యం బయటకురావడంలేదు. స్కూళ్లలో క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు కాలేజీకి వచ్చే వరకు పీడీలు లేక నిరుత్సాహానికి గురువుతున్నారు.
ఈ స్థాయిలో సరైన శిక్షణ, ట్రైనర్ ఉంటే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటీవల పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన చికిత స్కూల్, కాలేజీ నుంచి ఆర్చరీలో ప్రతిభ కనబర్చేది. కానీ చికితకు స్కూల్, కాలేజీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. అయిన వ్యక్తిగతంగా జాతీయ స్థాయిలోకి వెళ్లేలా సాధన చేసింది. అలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎందరో ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నారు. వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
ఏండ్లుగా నో రిక్రూట్‌మెంట్
దశాబ్దాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు లేరు. ఉన్న వారంతా వయోభారంతో రిటైర్డ్ అవుతుండగా.. కొత్త రిక్రూట్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఒక్క కరీంనగర్ జిల్లాకేంద్రంలోని జూనియర్ కాలేజీలో మాత్రమే పీడీ ఉన్నాడు. పీడీల కొరత తీర్చడానికి స్కూళ్లలోని పీఈటీకు ప్రమోషన్ ఇచ్చి కాలేజీలకు పంపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో పీఈటీలు కూడా రిటైర్ అవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తుండగా.. ఇప్పటికైనా పీడీలను నియమించాలని పలువురు కోరుతున్నారు.
శిక్షణ లేక క్రీడల్లో రాణించడం లేదు
కాలేజీల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థుల క్రీడా సామర్థ్యం గుర్తించలేకపోతున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడాసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారికి కాలేజీల్లో శిక్షణ లేక రాణించడం లేదు. అవసరం ఉన్నచోట వెంటనే పీడీలను నియమిస్తే వందలాదిగా క్రీడాకారులు తయారవుతారు. -కల్పన, పెద్దపల్లి జిల్లా ఇంటర్విద్యాధికారి