తెలంగాణ రేడియాలజీ హబ్​ను వెంటాడుతున్న టెక్నీషియన్ల కొరత

తెలంగాణ రేడియాలజీ హబ్​ను వెంటాడుతున్న టెక్నీషియన్ల కొరత
  • కొత్తగూడెం సర్కార్​ దవాఖానలో సిటి స్కాన్​ ఉన్నా ప్రైవేటుకు వెళ్లాల్సిందే
  •     హామీలకే పరిమితమైన 2డీఈకో, ట్రామా సెంటర్, ఎంఆర్ఐ ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని గవర్నమెంట్​ హాస్పిటల్​ను మెడికల్​ కాలేజీకి అనుబంధంగా 330 పడకల హాస్పిటల్​గా ప్రభుత్వం అప్​గ్రేడ్​ చేయడంతో జిల్లావాసులు ఆనందపడ్డారు. మెడికల్​ కాలేజీ ఓపెనింగ్​ టైమ్​లో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్​ కుమార్​ తో పాటు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు.

అధునాతన మిషనరీతో నాణ్యమైన వైద్య సేవలు జిల్లావాసులకు అందుతాయని, కార్పొరేట్​ స్థాయి సేవలు సర్కార్​ హాస్పిటల్ లోనే అందుతాయని పేర్కొన్నారు. టెస్టుల కోసం ఇక ప్రైవేట్​కు పోవాల్సిన అవసరం లేదన్నారు. రూ. కోట్లు వెచ్చించి కొత్తగూడెంలో తెలంగాణ రేడియాలజీ హబ్​ ఏర్పాటు చేశారు. టెక్నీషియన్లను ఇవ్వకపోవడంతో రోగులు ప్రైవేట్​ బాట పట్టే పరిస్థితి. ఈ హబ్  నామ్​కే వాస్తేగా మారడంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి ఉంది.

వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత..

కార్పొరేట్​ స్థాయిలో టెస్ట్​లు, వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తెలంగాణ రేడియాలజీ హబ్​ను కొత్తగూడెంలో ఈ నెల 8న ప్రారంభించింది. ఈ హబ్​లో మహిళల్లో క్యాన్సర్ ను​ గుర్తించేందుకు మామోగ్రామ్​ మెషీన్​ ఏర్పాటు చేశారు. సిటి స్కాన్​, అధునాతమైన ఎక్స్​రే ల్యాబ్​ను అందుబాటులోకి తెచ్చారు. అన్నిరకాల మెషీన్లు ఉన్నా వాటిని అపరేట్​ చేసేందుకు అవసరమైన రేడియాలజిస్ట్​లు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్​లకు వెళ్తున్నారు. కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న రేడియాలజిస్ట్​ కొత్తగూడెం గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​ పక్కనే ఉన్న రేడియాలజీ హబ్​లో పని చేయాల్సి ఉంది.

ఇక్కడ పని చేసే రేడియాలజిస్ట్​ వైద్యవిధాన పరిషత్​కు చెందిన వారు కావడం గమనార్హం. అక్కడి నుంచి ఇక్కడికి రానుపోను 8 కిలోమీటర్లు ఉంటుంది. పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అడ్వకేట్​తో పాటు మరో యువకుడు గాయాలపాలయ్యాడు. గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తీసుకువస్తే సిటి స్కాన్​ చేయాలని డాక్టర్లు చెప్పారు. టెక్నీషియన్​ అందుబాటులో లేరని చెప్పడంతో ప్రైవేట్​కు వెళ్లాల్సి వచ్చిందని బాధితుడి కుటుంబసభ్యులు వాపోయారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా గవర్నమెంట్​ హాస్పిటల్స్ లో ఎక్కడా ఎంఆర్​ఐ లేదు. ఎంఆర్ఐ కావాలంటే ఖమ్మం, వరంగల్​, హైదరాబాద్​ వెళ్లాల్సిందే. లేదంటే రూ. వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్​కు వెళ్లాల్సిందే.

జిల్లాలో యాక్సిడెంట్​ కేసులు పెరగడంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ట్రామా సెంటర్​ ఏర్పాటు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇక తెలంగాణ రేడియాలజీ హబ్​లో 2డీఈకో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా, మెషిన్లు రాక ఖాళీ రూమ్​ వెక్కిరిస్తోంది. ఇదిలాఉంటే కొత్తగూడెం రేడియాలజి హబ్​పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఉదయం 9 గంటలకు రావాల్సిన సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని రోగులు వాపోతున్నారు. 

టైం పాటించేలా చూస్తాం

తెలంగాణ రేడియాలజీ హబ్​లో సిబ్బంది ఆలస్యంగా వస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. టైమ్​కు వచ్చేలా చర్యలు చేపడతాం. ఎంసీహెచ్​ రేడియాలజిస్ట్​ ఇక్కడకు కూడా వస్తున్నారు. 2డీఈరో మిషనరీని ఏర్పాటు చేస్తాం. ఎంఆర్ఐ కోసం కృషి చేస్తున్నాం.  - కుమారస్వామి, సూపరింటెండెంట్, గవర్నమెంట్​ హాస్పిటల్​ కొత్తగూడెం