మ్యూజిక్​లో తన మార్క్​ చూపిస్తున్నడు

మ్యూజిక్​లో తన మార్క్​ చూపిస్తున్నడు

‘అ!’ టాలీవుడ్​కి కొత్త ఫ్లేవర్ అద్దిన సినిమా. డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో వచ్చిన ఈ సినిమాలోని ఒక్కో పాత్ర ఒక్కో ఎమోషన్​ని చూపించింది. ఆ ఎమోషన్స్​కి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్​తో ప్రాణం పోశాడు మార్క్​ కె రాబిన్​.​​ అందుకే ఆ సినిమా చూసిన వాళ్లు కథని, అందులోని నటీనటుల్ని ఎంత మెచ్చుకున్నారో రాబిన్​ కె మార్క్​  మ్యూజిక్​నీ అంతే పొగిడారు. ఆ ఒక్క సినిమానే కాదు ఆ వెంటనే రిలీజ్​ అయిన మనసుని తాకే ‘మల్లేశం’, ‘ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలకి మ్యూజిక్​ ఇచ్చింది కూడా ఆయనే. రీసెంట్​గా ‘ జాంబిరెడ్డి’కి ట్యూన్స్​ కట్టిన ఈ హైదరాబాదీ మ్యూజిక్​ డైరెక్టర్​ మ్యూజికల్​ జర్నీ ఇది. 

‘పాటలంటే ఇష్టం.. కానీ, సినిమాల్లోకి రావాలన్న ఆలోచనలు లేవు. బతికినంత కాలం మ్యూజిక్​లోనే ఉండాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. అదే రాబిన్​ని మ్యూజిక్​ టీచర్​ని చేసింది. దాదాపు పదేళ్ల పాటు పిల్లలకి మ్యూజిక్​ పాఠాలు చెప్పాడు ఈ యంగ్​ మ్యుజీషియన్​​. అక్కడ్నించి అనుకోని మలుపులతో షార్ట్​ ఫిల్మ్స్​ వైపు నడిచాడు. దేశంలోనే మొదటి వర్చువల్​ ఆడియో షార్ట్​ ఫిల్మ్ ‘ డైలాగ్​ ఇన్​ ది డార్క్​’ కి ట్యూన్స్​ కట్టాడు.‘ ఢిల్లీ బెల్లీ’ షార్ట్​ ఫిల్మ్​కి బెస్ట్ మ్యూజిక్​ డైరెక్టర్​గా ‘నోయిడా ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్’​లో అవార్డు తీసుకున్నాడు. అవన్నీ చూసి సినిమా అవకాశాలూ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ, దీనంతటికీ ముందు నాకు మ్యూజిక్​ని పరిచయం చేసిన అమ్మానాన్న గురించి చెప్పాలంటాడు రాబిన్. 
 

అంత పిచ్చి పాటలంటే

‘‘నేను పుట్టిన ఏడాదే నాన్న డేనియల్ జాన్​  ఇంట్లో మ్యూజిక్​ సిస్టమ్​ పెట్టించారు. అలా నాన్​స్టాప్​గా ఇంట్లో పాటలు ప్లే అవుతూనే ఉండేవి. అవి వింటూ మెల్లిగా నేనూ పాడటం నేర్చుకున్నా. ఆ హాబీ రానురాను ఒక ఎడిక్షన్​గా మారింది. అది ఎంతలా అంటే పాట లేకపోతే ముద్ద  గొంతు దిగనంత. ఇళయరాజా, రెహ్మాన్ పాటలంటే చెవి కోసుకునేవాడ్ని. అమెరికన్​ మ్యూజిక్​ కంపోజర్​ జేమ్స్​ హార్నర్​ పాటలు కూడా బాగా వినేవాడ్ని. ఆయన ‘టైటానిక్’​  క్యాసెట్​ కోసం నేను పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ఆ క్యాసెట్​ రిలీజ్​ రోజు తెల్లారక ముందు షాపుముందు నిల్చున్నా. మళ్లీ అదెక్కడ పాడైపోతుందోనని ఆ పాటల్ని ఎంప్టీ క్యాసెట్​లో రికార్డు చేసి దాన్ని ప్లే చేసేవాడ్ని.  పాటల మీద అంత ఇష్టం ఉండటంతో చదువు బుర్రకి ఎక్కలేదు. ఆ విషయంలో ఇంట్లోనూ కంప్లైంట్స్​ ఉండేవి. 
నాన్న ఆఫీసుకెళ్లేంత వరకు.. యూనిఫాం వేసుకుని స్కూల్​కి వెళ్తున్నట్టు హడావిడి చేసేవాడ్ని. ఆయన ఇంటి గుమ్మం దాటడం ఆలస్యం..పాటలు పెట్టేవాడ్ని. ఇలా చాలా రోజులు. కాదు.. కాదు ...సంవత్సరాలే మేనేజ్​ చేశా. కాలం కలిసిరాక అప్పుడప్పుడు స్కూల్​కి వెళ్లాల్సివస్తే.. అక్కడి పరిస్థితి ఇంకోలా ఉండేది. సినిమా రేంజ్​లో ఫైటింగ్స్​ చేసేవాడ్ని. దెబ్బలతో ఇంటికొచ్చేసరికి నాన్నకి సీనంతా​ అర్థమయ్యేది. ఆ తర్వాత మళ్లీ తిట్లు.. స్కూల్​ మార్చడం. ఇవన్నీ ఒక రకమైతే ..సెవెన్త్​ క్లాస్​లో మా ఫ్రెంచ్​  టీచర్​కి ప్రపోజ్​ చేశా. అది కూడా నా ఫేవరెట్​ లిటిల్​ హార్ట్స్​​ ప్యాకెట్​ ఇచ్చి. కానీ, ఆ టీచర్​ నా ప్రపోజల్​ని నేరుగా ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లింది. ఆ రోజు ప్రిన్సిపల్​ తిట్టిన తిట్లు ఇంకా నా చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ దెబ్బకి అమ్మాయిల్ని కన్నెత్తి చూడడమే మానేశా. కానీ, మ్యూజిక్​ని మాత్రం అంత తేలికగా వదల్లేకపోయా. సొంతంగా గిటార్, పియానో, కీ బోర్డు అన్నీ నేర్చుకున్నా . 
 

ఆ తర్వాత.. 

సినిమాలకి మ్యూజిక్​ చేయాలన్న కోరిక లేకపోయినా.. మ్యూజిక్​లోనే ఉండాలని డిసైడ్​ అయ్యా. అలాంటప్పుడు ఎంబీబీఎస్, బీటెక్​ అంటూ  తిరిగితే టైం వేస్ట్​ తప్ప లాభం ఉండదనిపించింది. ఈ విషయాన్ని మా ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. దాంతో ఒక పక్క చదువుకుంటూనే ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​లో మ్యూజిక్​ టీచర్​గా చేరా.  పిల్లలకి పాటలతో పాటు గిటార్, కీ బోర్డు, డ్రమ్స్​​ వాయించడం నేర్పించేవాడ్ని. అయితే అప్పటికే మా కజిన్​ ‘వినాయకుడు’ సినిమాకి మ్యూజిక్​ ఇచ్చాడు. దాంతో రెండుమూడు సార్లు సరదాగా తన స్టూడియోకి వెళ్లి రికార్డింగ్​ ప్రాసెస్​ తెలుసుకున్నా. అలా సాగిపోతున్న లైఫ్​కి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు  డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మ . ఆయన డైరెక్షన్​లో వచ్చిన ‘ డైలాగ్ ఇన్​ ది డార్క్’ అనే షార్ట్​ ఫిల్మ్​కి మ్యూజిక్​ ఇచ్చా. దేశంలో వర్చువల్​ మోడ్​లో వచ్చిన మొదటి షార్ట్​ ఫిల్మ్​ అది. దానికి మంచి పేరు రావడంతో మరిన్ని షార్ట్​ ఫిల్మ్స్​కి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది. అలా నేను మ్యూజిక్​ కంపోజ్​ చేసి ‘మళ్లీ కలుద్దాం’ షార్ట్​ ఫిల్మ్​కి బెస్ట్​ మ్యూజిక్​ డైరెక్టర్​గా ‘సైమా’ అవార్డు తీసుకున్నా. ‘ఢిల్లీ బెల్లీ’కి  ‘ నోయిడా ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​’లో  అవార్డు అందుకున్నా. దాంతో మెల్లిగా సినిమాల్లోకి రావాలన్న ఆలోచన మొదలైంది.
 

నాని బైక్​పై వచ్చారు! 

అవకాశాల కోసం నేను ఏ  సినిమా ఆఫీసుకి వెళ్లలేదు. కానీ, నా పాటలు​ విని కొందరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ‘సినిమా తీద్దాం.. కథ రాయాలి’ అని చెప్పి నా ట్యూన్స్​ పట్టుకెళ్లారు. ఇప్పటివరకు వాళ్లు మళ్లీ తిరిగి రాలేదు. ఆ సిచ్యుయేషన్స్​ నుంచి బయటికి వస్తున్నప్పుడే ఒక ఫోన్​ కాల్ వచ్చింది. అది కూడా రాత్రి తొమ్మిదింటికి. ఇప్పటికీ గుర్తుంది. ఆ ఫోన్​ వచ్చినప్పుడు బైక్​ సర్వీసింగ్​కి ఇచ్చి...మెకానిక్​తో ముచ్చట్లు పెడుతున్నా. లిఫ్ట్​ చేయాలా వద్దా అనుకుంటూనే​ ఎత్తితే​ ‘‘నాని చేస్తున్న ‘మజ్ను’  సినిమా  థియేట్రికల్ ట్రైలర్​కి మ్యూజిక్​ చేయాలి. మరికొద్దిసేపట్లో నాని స్టూడియోకి వస్తాడు’’ అని చెప్పారు. ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. మరో నిమిషంలో తెరుకుని​ సర్వీసింగ్​ పూర్తవ్వకముందే బైక్​ తీసుకుని స్టూడియోకి బయల్దేరా. నా స్టూడియో చిన్న గల్లీలో ఉంది.  దాంట్లోకి పెద్దపెద్ద కార్లు రావాలంటే ఒక గండమే. దాంతో కొంచెం టెన్షన్​ పడుతూనే నాని కోసం వెయిట్ చేస్తున్నా. పన్నెండు, పన్నెండున్నరకి  బైక్స్​ మీద అసిస్టెంట్​ డైరెక్టర్స్​ వచ్చారు. వాళ్లు ‘స్టార్ట్​ చేద్దామా !’ అని అడిగితే ఇంకా ‘‘నాని రాలేదుగా అన్నా’’. ఆ వెంటనే పక్కనుంచి నాని హెల్మెట్​ తీసి ‘హాయ్’​ అన్నారు. నా మ్యూజిక్​ విని ‘ఇంత కాలం ఎక్కడున్నావ్​.. ఫ్యూచర్​లో​ మంచి సినిమా తీద్దాం’ అన్నారు. అలా ‘ అ! ’ సినిమా అవకాశం వచ్చింది. 
అ! తో మొదలై..
‘అ!’  సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాని ఎవరు ప్రొడ్యూస్​ చేస్తున్నారు. అందులో ఎంత పెద్ద స్టార్స్​ నటిస్తున్నారని చూడలేదు నేను. కథనే మైండ్​లో పెట్టుకుని మ్యూజిక్​ చేశా. దానికి మంచి పేరు రావడంతో వరుసగా అవకాశాలొచ్చాయి. కానీ, మొదట్లో కమర్షియల్​ సినిమాని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. దాంతో భయం వేసి ఏడెనిమిది ప్రాజెక్ట్స్​ వదిలేశా. నాకు కనెక్ట్​ అయిన కథల్నే ఎంచుకున్నా.. అలా నేను మ్యూజిక్​ చేసిన  ‘సూర్యకాంతం’ , ‘మల్లేశం’ , ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్​గా రిలీజ్​ అయిన ‘జాంబిరెడ్డి’ కూడా నా మ్యూజిక్​ కెరీర్​కి ప్లస్​ అయింది. ‘పుష్పక విమానం’ బ్యాక్​ గ్రౌండ్​ స్కోర్​ కూడా పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పటివరకు నాకు నచ్చిన కథలకే నేను మ్యూజిక్​ ఇచ్చా. ఫ్యూచర్​లోనూ అదే ఫార్మాట్​ ఫాలో అవ్వాలనుకుంటున్నా. ప్రస్తుతం ‘మిషన్​ ఇంపాజిబుల్’​, ‘అనగనగా ఒక రౌడి’ తో పాటు మరో నాలుగు సినిమాలకి ట్యూన్స్​ కడుతున్నా.

ఆ లోటు తీర్చలేనిది
ఇంట్లో అందరికన్నా అమ్మకే ఎక్కువ క్లోజ్​ నేను. ప్రతి చిన్న విషయం తనతోనే షేర్​ చేసుకునేవాడ్ని. అలాంటి అమ్మ నా మ్యూజిక్​ కెరీర్​ మొదలవ్వకముందే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఆ​ తర్వాత నాలుగైదు సంవత్సరాలు డిప్రెషన్​లో ఉన్నా. ఆ టైంలో నాన్న నాకోసం ఉద్యోగం మానేసి అమ్మ స్థానాన్ని తీసుకున్నారు. ఆయన వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను.

ఆ మూమెంట్​ మర్చిపోలేను​
ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ మ్యూజిక్ డైరెక్టర్​గా నాకు తృప్తినిచ్చాయి. అయితే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ప్రెస్​ మీట్​​లో అడివి శేషు మాట్లాడుతూ ‘‘థియేటర్​ నుంచి బయటికొచ్చాక ఎవరైనా ఆ సినిమాలోని హిట్​ సాంగ్స్​ని పాడుతుంటారు. కానీ, ఈ సినిమా చూశాక నేను మార్క్​ కె రాబిన్​ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ని హమ్ చేస్తున్నా’’ అన్నారు. ఆ మాటలకి  అక్కడున్న ప్రెస్​ వాళ్లు కూడా నాకు స్టాండింగ్​ ఒవేషన్​ ఇచ్చారు. అది నా లైఫ్​లో ఎప్పటికీ మెమరబుల్ మూమెంట్​.  

పర్సనల్​ లైఫ్​లో ..
నాకు బైక్స్​ అంటే పిచ్చి. వింటేజ్​ బైక్​లంటే మరీ ఇష్టం. ఫొటోగ్రఫీ కూడా ఇష్టం. మ్యూజిక్​ వైపు  లేకపోతే బైక్​ రేసర్​గానో, నేచర్​​ ఫొటోగ్రాఫర్​గానో సెటిల్​ అయ్యేవాడ్ని. డే అండ్​ నైట్​ మ్యూజిక్​లోనే గడుపుతా.. ఇవేమీ లేవంటే నా చిన్ననాటి ఫ్రెండ్స్​ దగ్గరికి వెళ్తా. ఇప్పట్లో పెండ్లి ఆలోచనలు లేవు. 
                                                                                                                                                                                                                                                :::ఆవుల యమున