ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలపర్చేందుకు తాము ఎవ్వరితో అయినా ఫైట్ చేస్తామని పేర్కొన్నారు. మా పోరాటం భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ శ్రద్ధా వాకర్ కేసు లవ్ జిహాద్ కు సంబంధించింది కాదని.. బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని అసద్ ఆరోపించారు. 

ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్‌కేస్‌లో ఉంచిన ఆజంగఢ్ ఘటనను ఒవైసీ  గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వాటిని రాజకీయం చేయొద్దని హితవు పలికారు. హిందూ-ముస్లిం కోణంలో అలాంటి ఘటనలను చూడొద్దని సూచించారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఈ ఘటనను మతపరమైన కోణంలో చూపించారని ఒవైసీ మండిపడ్డారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 14 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుంది. గుజరాత్‌లో బీజేపీ గత 27 ఏళ్లుగా అధికారంలో ఉంది.