Trikala Review: మైథలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘త్రికాల’.. ప్రేక్షకులను మెప్పించిందా?

Trikala Review: మైథలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘త్రికాల’..  ప్రేక్షకులను మెప్పించిందా?

హీరోయిన్ శ్రద్ధా దాస్ లీడ్ రోల్‌‌లో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘త్రికాల’ (Trikala). మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక, శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్‌‌ఎల్‌‌పీ ద్వారా గురువారం (మే 28, 2026న) సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌, ప్రమోషనల్ కంటెంట్  సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. ‘దైవిక శక్తులు, అతీత శక్తుల’ మధ్య జరిగే సస్పెన్స్‌‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కించిన ‘త్రికాల’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.

కథగా..

శంకర్ పల్లి అనే గ్రామం చుట్టూ జరిగే కథ. పూర్వం ఆ ఊరి జమిందారు చేసిన గోవధ పాపం అతన్ని కుటుంబాన్ని, ఆ ఊరిని వెంటాడుతుంది. అతని భార్య ఆ ఊరి దేవత కాటేరమ్మను శరణు వేడడంతో ఊరికి ముప్పు తప్పుకుంది. కానీ ఆ ఇంట్ల  పుట్టే ప్రతి మగ శిశువుకి అంగవైకల్యం వస్తుంది. ఆ వంశ ప్రస్తుత తరం వారసుడే వైతరణ్ (అజయ్).  సూర్యరశ్మిని తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ వ్యాధితో బాధపడుతున్న వైతరణ్‌ను అతని సవితి తల్లి సంధ్య (ఆమని) పెంచి పెద్దచేస్తుంది. కానీ మానసిక సమస్యతో తనను తాను స్పెషల్ పర్సన్‌గా ఊహించుకుని, చుట్టూ ఉన్న వాళ్లు తనను మోసం చేస్తున్నారు అనే భ్రమలో ఉండే వైతరణ్‌.. చిన్నప్పుడే తన తండ్రి (దేవీప్రసాద్)ని చంపి జైలుకెళ్తాడు. అక్కడ అతనికి సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ట్రీట్మెంట్ చేస్తుంది. తిరిగొచ్చాక కూడా అతని పరిస్థితిలో ఎలాంటి మార్పు రాక పినతల్లిని కూడా హత్య చేసి, తను చనిపోతాడు. కానీ అతని ఆత్మ ఆ బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. 

మరోవైపు ఫోన్ ద్వారా పరిచయమైన తన ప్రేయసి నిధి (సాహితి)ని వెతుకుతున్న శివ (మాస్టర్ మహేంద్రన్‌) అనుకోకుండా ఆ బంగ్లాకు వచ్చి ఇరుక్కుపోతాడు. ఇక శ‌తాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో తాంత్రిక రహస్యాలను అసురుల చేతికి చిక్కకుండా త్రికాల వర్మ రక్షించేవాడు. అతని వీరమరణం తర్వాత ఆ ఆత్మను మునులు ఓ మాయా అండంలో బంధిస్తారు.  కలియుగంలో దుష్ట శిక్షణ కోసం ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు.  దర్వాడి తాంత్రిక తెగ తమ క్షుద్ర పూజలతో ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి త్రికాలవర్మ ఆత్మను  మేల్కొలుపుతుంది. ఆ ఆత్మకు, వైతరణ్‌కు సంబంధం ఏమిటి..? ఆ గ్రామంలో వరుస మరణాలకు కారణం ఏమిటి..? మాయ ద్వారా నిజం తెలుసుకున్న శివ ఏం చేశాడు.. అతని ప్రియురాలు నిధికి ఏమైంది.. లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఎలా ఉందంటే.. 

దర్శకుడు మణి తెల్లగూటి ఈ చిత్రాన్ని మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మలు, తాంత్రిక శక్తులతో పాటు మానసిక భయాలు, మానవ భావోద్వేగాలను ఈ కథలో మిళితం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇదొక మల్టీ జానర్ సినిమా. కథలో ఆ స్కోప్ ఉంది. కానీ ఇన్ని అంశాలను ఒకే సినిమాలో జొప్పించడం చాలా కష్టం. ఓవైపు ఊర్లో జరుగుతున్న వరుస మరణాలు, మరోవైపు తాంత్రిక అంశాలు, ఇంకోవైపు హీరో ఫోన్ లవ్ స్టోరీ, సైక్రియాటిస్ట్ ట్రాక్ ఇలా తెరపై ఇబ్బడిముబ్బడిగా సీన్స్ రావడంతో ఫస్ట్ హాఫ్‌ అర్థం అయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది. అయితే సెకండాఫ్‌ను డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఒక్కో సీక్రెట్‌ను రివీల్ చేస్తూ కథ ముగించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని పాత్రల మానసిక స్థితి, వారి పునర్జన్మల ద్వారా చూపించడం, పురాణాలకు ప్రస్తుత కాలానికి లింక్ చేయడం బాగుంది. అయితే ఇంత క్లిష్టమైన అంశాన్ని ఇంకాస్త సులభంగా చెప్పుంటే బాగుండేది.
 
 ఎవరెలా నటించారంటే?

సినిమాకు ఎంతో కీలకమైన వైతరణ్ పాత్రలో అజయ్ చక్కగా ఇమిడిపోయారు. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి, మానసిక అంతర్మథనాన్నిఅజయ్ అద్భుతంగా చూపించారు. శివగా నటించిన మాస్టర్ మహేంద్రన్‌ నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సైకియాట్రిస్ట్ పాత్రలో శ్రద్ధా దాస్‌ సెటిల్డ్‌గా నటించింది. తల్లి పాత్లరో ఆమని నటన సినిమాకు ప్లస్ అయింది. అనుమానపు భర్తగా దేవీప్రసాద్ నటన ఇంప్రెస్ చేసింది. ప్రభాకర్, సూర్య, రోహిణి పాత్రల పరిధి మేరకు కనిపించారు. 

టెక్నీకల్ అంశాలు:

దర్శకుడు మణి ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా తెరకెక్కించారు. తనకున్న బడ్జెట్‌ పరిమితులకు లోబడి వీలయినంత క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇచ్చారు. ముఖ్యంగా ఎక్కువ సెట్స్‌ లేకుండా సీజీ బ్యాక్‌డ్రాప్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు.  ఎడిటింగ్‌లో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. మ్యూజిక్, సౌండ్ డిజైన్‌, కెమెరా వర్క్‌ కథకు తగ్గట్టుగా సాగాయి.

ALSO READ : కూల్ ఫ్యామిలీ.. కిల్లర్ కరాటే మాస్టర్స్..