శ్యామల కవితల మాల

శ్యామల కవితల మాల

 

  • గడ్డం శ్యామల ‘మయూరి’ కలం పేరుతో రాసిన వచన కవితా సంపుటం ‘తూరుపు సింధూరం’. 

“భూదేవి ఆకుపచ్చ పట్టుచీరమీద పసుపురంగు పువ్వులు కుట్టించుకొని తన అందాన్ని ఆరబోసింది” “నల్లరంగు చీరమీద జరీ పువ్వులు కుట్టినట్లు తారురోడ్డుపై వడగళ్లు” వంటి పంక్తులలో కవిత్వం గుబాళిస్తుంది. కవయిత్రి ‘అమ్మాయి’ కవితలో పోలికలను అందంగా పొదిగింది. ‘తెలుగు వాకిట వెలుగు ఆమని’ని ముత్యాలసరాలలో కూర్చింది. చేతిలో ‘పండింది గోరింట మొక్క లేకుండానే’ అని చమత్కరించింది. 

“కరి మబ్బుల మాటునున్న చినుకు చిందేయనీ| చినుకు పలకరింపులో మనసు పులకరించనీ” అని భావ కవిత లల్లుతుంది. దరాబాద్ సౌందర్యాన్ని, సంస్కృతిని, వాటి వెనకాల ఉన్న శ్రమనూ గుర్తిస్తుంది. “శ్రమ జీవుల సౌభాగ్యం భాగ్యనగరం” అని పేర్కొంటుంది. జాతి జీవగర్ర రైతు. అటువంటి రైతుల జీవితాలు “ఎండిన భూముల్లాగానే నెట్టెలు బాసినయ్” అని ఆవేదన చెందుతుంది. తపాలా బంట్రోతు సాహితీ బంధువైన వైనం చెబుతుంది. “కవులకు లక్ష్మణరేఖలు గీసే ప్రభుత్వాలు మాకొద్దు” అని నినదిస్తుంది. పరువు హత్యకు నిరసనగా, కుల దురహంకారానికి మండిపడుతుంది. “తెగేదాకా లాగితే ఏ బంధాలు నిలవవు,- మధ్యే మార్గంగా నడిస్తే మాట విలువ పెరుగుతుంది. అని బంధం బలపడే మాట చెబుతుంది. “సస్యశ్యామల భూములు ప్లాట్లుగా, ఫ్లాట్లుగా రూపాంతరం చెందితే భారతీయ ఆత్మనే అమ్ముకుంటున్నట్లు ఈ రచయిత్రి బాధపడుతుంది. “తినడానికి బియ్యం గింజ దొరకనప్పుడు... నీవు బతుకు మూల్యం చెల్లించక తప్పదు” అని హెచ్చరిస్తుంది. “ఓ మనిషీ! నీ అంతరంగ గవాక్షంలోకి తొంగి చూసుకో - నీవు చేస్తున్న చేతలను లెక్కించుకో” అని బోధిస్తుంది.
కరోనా గురించి రాస్తూ - ప్రకృతితో మనిషి ఆడుకున్నాడు. “ఇప్పుడు మరణం మనిషితో ఆడుకుంటుంది... సంపదెంత ఉన్నా ఏనాటికైనా ఒక్కడిగానే జీవించాలనే జీవన సత్యాన్ని బోధించింది” అని తెలిపింది.

స్త్రీ పది పనులను రెండు చేతులతో నాట్యం చేస్తున్నట్లు చేస్తుందని ప్రశంసిస్తుంది. కరోనా సమయంలో అందరికీ ఆమె ఆధారమై, ఇంటికే రక్షణ కవచమైన విధము తెలిపింది. భర్త నెవరైనా పొగిడినప్పుడు భార్య తననే పొగిడినట్లు పొంగిపోతుంది. ఆదే సమాజం తనను ప్రశంసిస్తే భర్త ముఖ కవళికల్లో మార్పెందుకు? అని కవయిత్రి ప్రశ్నిస్తుంది. ఆమె కూడా మనిషేనని, సమాజంలో ఒక భాగమేనని గుర్తించాలి. “మనసు గాయం చేయడం తేలికే! గాయపడిన వేదన అనంతం.”

ఆడదానికీ మగవాడికీ విలువలో తేడా లెందుకు? “ఆమె చూస్తే తప్పు, చూడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు. ఇక ఆమెపై లైంగిక దాడులు, శారీరక దాడులు, ఉన్మాద దాడులు. ప్రేమించకపోతే దాడి, పెళ్లాడకపోతే దాడి, వివాహమైనాక దాడి, విడిపోయినా దాడి, పసిదానిపైన దాడి, భూమ్మీదకు రాకముందే దాడి. ఈ దౌర్జన్యాలకు అంతం లేదా అని అక్రోశిస్తుంది. చదువులో, సంస్కారంలో, ఆటల్లో, పాటల్లో మేటిగా రాణించినా ఆత్మరక్షణ చేసుకునే అబల వెనుకబడ్డదని దురపిల్లుతుంది. ఏనాడో ఒకనాడు మగువల మనసుల్లో అగ్ని పర్వతాలు బద్దలయి ప్రపంచాన్నే దహించే రోజొస్తుందని శపిస్తుంది. “మన యుద్ధం మనమే చెయ్యాలి” అని మహిళలకు ప్రబోధిస్తుంది. ఇందులో గాంధీజీ, జాషువా, అబ్దుల్ కలాం, సినారె, పి.టి. ఉష, ఉస్మానియాలపైన కవితలున్నాయి. ఈ గ్రంథంలో “మరణించినా బ్రతకడం మన చేతుల్లో ఉంది... ఆత్మ విశ్వాసమే ఆలంబనగా/రేపటి ఉషస్సులను కాంచే బిడ్డలకు/శ్వాసవుదాం/భావి తరాన్ని మేధాపటిమతో పటిష్టం చేద్దాం” అనే గొప్ప సందేశముంది. గజళ్ల శ్యామలగా గణుతికెక్కిన ఈ రచయిత్రి వచన కవితల రచనలో మరింత సాధన చేయాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను.
- ఎ. గజేందర్ రెడ్డి సెల్ : 98488 94086ప్రతులకు : గడ్డం శ్యామల ఫోన్​ : 97041 75183.