సివిల్ వివాదంలో ఎస్సై బెదిరిస్తుండు ..  మహిళా కానిస్టేబుల్ ఆందోళన  

సివిల్ వివాదంలో ఎస్సై బెదిరిస్తుండు ..  మహిళా కానిస్టేబుల్ ఆందోళన  

మేడిపల్లి, వెలుగు: సివిల్ వివాదంలో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఎంక్వైరీ చేయకుండా ఎస్సై శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా కానిస్టేబుల్ ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది జూన్​లో బోడుప్పల్ లోని తమ ఇంటిని కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో  కబ్జా చేయడానికి రాగా వారిపై మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశామని మహిళా కానిస్టేబుల్ నాగమణి పేర్కొన్నారు. ఎంక్వైరీ చేయకుండా ఎస్సై శివకుమార్ కబ్జాదారుల నుంచి డబ్బులు తీసుకొని వత్తాసు పలకగా.. తాము మానవ హక్కుల కమిషన్, సీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.  

దీంతో కక్ష గట్టిన ఎస్సై తమ కుటుంబ వివాదంలోనూ జోక్యం చేసుకుని నకిలీ ఎంఎల్​సీతో మా అమ్మతో  కేసు పెట్టించి, నా భర్తను అరెస్ట్ చేయించారని ఆమె ఆరోపించారు. స్టేషన్ బెయిలుతో వదిలిపెట్టే చట్టాలు ఉండగా అన్యాయంగా రిమాండ్ కు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళా కానిస్టేబుల్​కే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై శివకుమార్ వివాదాస్పదుడని అందుకు సంబంధిన ఆడియోలు ఉన్నాయని, భూముల సెటిల్మెంట్లలోనూ ఘనుడని, ఆయనపై రాచకొండ సీపీ ఎంక్వైరీ చేయించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ నాగమణి కోరారు. 

అత్తపై దాడి కేసులో నాగమణి భర్తకు రిమాండ్ 

కర్రతో దాడి చేయడంతో చిటికెన వేలు విరిగిపోవడంతో ఆదిలక్ష్మి తన కూతురు కానిస్టేబుల్​నాగమణి, అల్లుడు వరుణ్​పై మేడిపల్లి పీఎస్​లో  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని మేడిపల్లి ఇన్​ స్పెక్టర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ఆమె అల్లుడుని రిమాండ్​కు తరలించామని, గతంలోనే వీరిపై కేసులున్నాయని సీఐ చెప్పారు.