జేసీబీ మాయమైన ఘటనలో ఎస్ఐ సస్పెన్షన్​

జేసీబీ మాయమైన ఘటనలో ఎస్ఐ సస్పెన్షన్​

మంచిర్యాల, వెలుగు:  జైపూర్ పోలీస్ స్టేషన్ నుంచి జేసీబీ మాయమైన ఘటనలో గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన రామకృష్ణ పై వేటుపడింది. పోలీసు ఉన్నతాధికారులు మూడు రోజుల కిందట ఆయనను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018లో భీమారం  మండలం పోలంపల్లి మాంతమ్మ టెంపుల్ సమీపంలో గుప్త నిధులు తవ్వుతున్నారనే ఆరోపణలపై అప్పటి ఎస్సై మంగిలాల్ జేసీబీని పట్టుకుని కేసు నమోదు చేశారు. భీమారం స్టేషన్లో జాగలేకపోవడంతో జేసీబీని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏడాది కిందట ఎస్సై రామకృష్ణ ఎలాంటి రిలీజింగ్ ఆర్డర్స్ లేకుండా జేసీబీని యజమానికి అప్పగించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు.  రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు జేసీబీ మాయంపై మంచిర్యాల డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్ విచారణ నిర్వహించారు. ఎస్సై రామకృష్ణ కోర్టు కేసులో ఉన్న జేసీబీని నిబంధనలకు విరుద్ధంగా రిలీజ్ చేసినట్టు నిర్ధారణ కావడంతో మొదట ఆయనను పొత్కపల్లి నుంచి కమిషనరేట్ కు అటాచ్ చేశారు. తర్వాత సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసినట్టు తెలిసింది.