
- కేసీఆర్, కేటీఆర్ వస్తే ఆధారాలతో సహా చూపిస్తం: సిద్ధరామయ్య
- వాళ్లిద్దరూ అబద్ధాలు చెబుతున్నరు
- మాది మిగులు బడ్జెట్ రాష్ట్రం.. ఆర్థికంగా బలంగా ఉన్నం
- తెలంగాణలోనూ వచ్చేది కాంగ్రెస్సే: కర్నాటక సీఎం సిద్ధరామయ్య
హైదరాబాద్/మక్తల్, వెలుగు: కర్నాటకలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నాయనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘మేం ఎవరినీ మోసం చేయలేదు. అన్ని వర్గాలకూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. కేసీఆర్‌ను కర్నాటక వచ్చి చూడాలని చెప్పినా ఆయన రాలేదు.
ALSO READ :- ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా
ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వస్తే ఆధారాలతో సహా చూపిస్తాం” అని చెప్పారు. తెలంగాణలోనూ వంద శాతం అధికారంలోకి వస్తామని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ ఏడాది మే 20న అధికారం చేపట్టిన వెంటనే ఐదు గ్యారంటీలపై సంతకం చేశానని ఆయన చెప్పారు.
జనవరి నుంచి నిరుద్యోగ భృతి..
అన్న భాగ్య యోజన కింద నెలకు ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని సిద్ధరామయ్య చెప్పారు. అయితే బియ్యం ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెట్టడంతో కిలోకు రూ.34 చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఈ స్కీమ్ తో 4 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ‘‘గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం.
గృహలక్ష్మి పథకం కింద 1.14 కోట్ల మంది మహిళలు ఇప్పటిదాకా రిజిస్టర్అయ్యారు. వారికి నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇక యువనిధి పథకం కింద డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ.3 వేలు, డిప్లొమా చదివిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి అందించనున్నాం. ఇది జనవరి నుంచి అమలు చేయబోతున్నాం” అని వెల్లడించారు. ఐదు గ్యారంటీల అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.38 వేల కోట్లు కేటాయించామని, వచ్చే బడ్జెట్లో అది రూ.58 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, అంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 165 హామీల్లో 150 అమలు చేశామని తెలిపారు.
ALSO READ :- రైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి
కానీ బీజేపీ ప్రభుత్వం 600 హామీలిచ్చి, వాటిలో పది శాతం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ‘‘గ్యారంటీల అమలుతో కర్నాటక ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుందని మోదీ అంటున్నారు. కానీ కర్నాటక ఆర్థికంగా చాలా బలంగా ఉంది. వివిధ రూపాల్లో రాష్ట్ర ఆదాయం పెరిగింది. అందుకు అనుగుణంగానే గ్యారంటీలను అమలు చేస్తూనే అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం” అని తెలిపారు. ‘‘కర్నాటకలో బిల్డర్ల దగ్గర స్క్వేర్ ఫీట్‌కు రూ.500 వసూలు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల కోసం కేసీఆర్ ఆడుతున్న అబద్ధాలు. అవినీతి ఆరోపణలపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్నాం” అని చెప్పారు
మా దగ్గర పెట్రోలు, డీజిల్ రేట్లు తక్కువ
తెలంగాణలో కంటే కర్నాటకలో డీజిల్, పెట్రోలు రేట్లు తక్కువగా ఉన్నాయని సిద్ధరామయ్య అన్నారు.తమ రాష్ట్రంలో గత ప్రభుత్వం 5 గంటలు కరెంట్ఇస్తే.. తాము 24 గంటలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరికి మద్దతుగా ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిస్తే చాలా గొప్ప అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని ధీమా వ్యక్తం చేశారు.