అలాంటి ప్రసక్తే లేదు.. ఐదేళ్లపాటు నేనే సీఎం : సిద్ధరామయ్య

అలాంటి ప్రసక్తే  లేదు..  ఐదేళ్లపాటు నేనే సీఎం : సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి  మారుతారంటూ ఊహాగానాలు వెలువడటంపై  ఆ రాష్ట్ర సీఎం  సిద్ధరామయ్య  స్పందించారు.  అలాంటి ప్రసక్తి లేనేలేదంటూ కొట్టిపరేశారు.  ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వమే ఉంటుందని,  తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు.  బీజేపీ భ్రమలో ఉందన్న సిద్దరామయ్య..  అధికారం లేకుండా వాళ్లు ఉండలేరని విమర్శించారు.  ఓసారి ఆపరేషన్‌ కమలం సక్సెస్ కావడంతో మరోసారి అలాగే చేయాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  

మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రులును నియమంచే అంశంపై కూడా సిద్ధరామయ్య మాట్లాడారు. ఏదైనా హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. హైకమాండ్‌తో చర్చించకుండా ఏదీ తేల్చలేం. ముఖ్యమంత్రిగా నేను గానీ, ఎమ్మెల్యేలుగా గానీ ప్రభుత్వాన్ని మార్చలేం.. మాకు హైకమాండ్ ఉంది, వారే నిర్ణయిస్తారని చెప్పారు.  

ఈ  ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్  పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సీఎం సీటుపై  సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో అధిష్టానం నిర్ణయం మేరకు  2023 మే 20న  సిద్ధరామయ్య సీఎంగా,  డీకేఎస్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ALSO READ :- పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ వచ్చేసింది