అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. హైమావతి

అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు  కలెక్టర్ కె. హైమావతి సూచించారు. గురువారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...  రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.  జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులెవరికీ సెలవులు లేవని చెప్పారు. అన్ని స్థాయిల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.  

జిల్లాలో ఇప్పటికే 29 నీటి వనరులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నాయని భారీ వర్షం కురిస్తే  లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రిలీఫ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ 08457- 230000 ను సంప్రదించాలని సూచించారు. అనంతరం సీపీ ఆఫీసు ఆవరణలో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.  ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు గరిమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఆర్డీవోలు సదానందం తదితరులు పాల్గొన్నారు.